Hyderabad CP Sandeep shandilya hospitalised: హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దాంతో ఆయనను హైదర్ గూడ అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బషీర్ బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉండగానే ఒక్కసారిగా సందీప్ శాండిల్య అస్వస్థతకు గురికావడంతో పోలీసులు, సిబ్బంది ఆయనను హాస్పిటల్ కు తరలించారు.


అపోలో హాస్పిటల్ వైద్యులు సీపీ సందీప్ శాండిల్యకు ప్రాథమికంగా కొన్ని మెడికల్ టెస్టులు చేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్యను సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం సాయంత్రం పరామర్శించారు. సందీప్ శాండిల్య ఇటీవల హైదరాబాద్ సీపీగా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో కీలకమైన హైదరాబాద్ కు సీపీగా వ్యవహరిస్తున్న సందీప్ శాండిల్య భద్రత పరంగా రోజూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 


కొన్ని మెడికల్ టెస్టుల అనంతరం హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య తన ఆరోగ్యంపై ఓ వీడియో విడుదల చేశారు. స్వల్ప అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తనకు స్పండిలైటిస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారని సీపీ చెప్పారు. కొంచెం లో బీపీ సమస్య ఉందన్నారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం కాస్త రెస్ట్ తీసుకుని, మంగళవారం నుంచి ఎప్పటిలాగే యథాతథంగా తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం కాకూడదని, వివరాలు చెప్పేందుకు వీడియో విడుదల చేసినట్లు చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.