Inter English Practical Exam : తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్య(Inter Education)లో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. మూసపద్ధతిలో ఇంగ్లిష్‌లో పరీక్షలు నిర్వహించడం కాకుండా, ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించి, విద్యాసంవత్సరం చివరిలో ప్రయోగ పరీక్షలను నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఇంగ్లిస్ ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఈ విద్యాసంవత్సరంలోనే ప్రాక్టికల్స్ నిర్వహణకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది.
విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో భాగంగా మీకు ఇష్టమైన టీచర్, ఆట గురించి ఇలా ఏదో ఒక అంశం గురించి ఒక నిమిషం పాటు మాట్లాడాల్సి ఉంటుంది. వారి గురించి మీకు తెలిసిన విషయాలు, ప్రత్యేకతలపై 60 సెకండ్ల పాటు ప్రసంగించాలి. ఇలా చేస్తేనే మార్కులు వేస్తారు. ఇలాంటివి మొత్తం 30 అంశాలు ఇస్తారు. వీటిల్లో ఒకదానిని ఎంచుకొని మాట్లాడాల్సి ఉంటుంది.
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో మూల్యాంకన పద్ధతుల్లో 'జస్ట్ ఏ మినట్(జామ్)'ఒకటి. ఇందులో భాగంగానే విద్యార్థులు నిమిషం పాటు ప్రసంగించాలి. ఇక రోల్ ప్లేలో భాగంగా ఇద్దరు విద్యార్థులు ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు పరస్పరం సంభాషించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక దుకాణాదారుడు.. వినియోగదారుల మధ్య సంభాషణను రోల్ ప్లేలో చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్‌లో భాగంగా విద్యార్థి మాటలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు రికార్డుచేస్తారు. దీనికి కూడా మార్కులుంటాయి.
విద్యాసంవత్సరం చివరిలో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఇంగ్లిష్ థియరీ పరీక్షను గతంలో మాదిరిగా 100 మార్కులకు కాకుండా, 80 మార్కులకు నిర్వహించనున్నారు. థియరీలో మార్కులు తగ్గినందున ఆ సబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగిస్తూ సిలబస్‌ను తగ్గించారు. అయితే థియరీలో 28 మార్కులు, ప్రాక్టికల్స్‌లో 7 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టు పరిగణనలోకి తీసుకుంటారు. టొఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు పునాది వేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు రాష్ట్రంలోని 2,600 లెక్చరర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
ఆ ఇంటర్నల్ పరీక్ష రద్దు..
తెలంగాణ ఇంటర్ పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 'ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్' ఇంటర్నల్ పరీక్షను ఇంటర్‌బోర్డు ఇటీవలే రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పాఠ్యాంశాలను లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో విలీనం చేయడం వల్ల ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు బోర్డు తెలిపింది. మరో ఇంటర్నల్ అయిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను యథాతథంగా నిర్వహించనున్నారు. వంద మార్కుల ఈ ఇంటర్నల్ పరీక్షను కాలేజీలోనే నిర్వహించి, అదే కాలేజీ లెక్చరర్లు మూల్యాంకనం చేసి, మార్కులేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ కాగా, ఈ మార్కులను రెగ్యులర్ మార్కుల్లో కలపరు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్‌లో ప్రాక్టికల్స్ అమలుచేయనుండటంతో థియరీకి, ప్రాక్టికల్స్‌కు వేర్వేరు పాఠ్యపుస్తకాలను బోర్డు సిద్ధం చేసింది. ఇంగ్లిష్ సబ్జెక్టు పుస్తకాల్లో ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పాఠ్యాంశాలు అంతర్భాగంగా ఉండటంతో ప్రత్యేకంగా పరీక్ష అవసరం లేదని అధికారులు భావించి, ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు..
ఇంటర్ పరీక్ష ఫీజు గడువు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబరు 14తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్ 23 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.1,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. చివరిగా రూ.2,000 రూపాయల ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించు అవకాశం కల్పించారు.
పరీక్ష ఫీజు వివరాలు..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్ విద్యార్థులు రూ.510
➥ ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్, ప్రాక్టికల్స్‌తో విద్యార్థులు రూ.730.
➥ ఇంటర్ సెకండియర్ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.510.
➥ ఇంటర్ సెకండియర్ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.730.
➥ ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.730.