Arekapudi Gandhi Vs Revanth Reddy: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయమని రేవంత్ ఆదేశాలు జారీ చేశారని, అందుకే తనపై హత్యా ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడినా భాష ఏంటని ప్రశ్నించారు. ఆయనే స్వయంగా బీఆర్ఎస్ లోనే ఉన్నాను కాంగ్రెస్ లో లేనని చెప్పారని కౌశిక్ రెడ్డి అన్నారు. కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ తో అంటకాగుతున్నారని విమర్శించారు. శుక్రవారం మధ్యాహ్నం కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. 


‘‘అరెకపూడి గాంధీనే స్వయంగా తాను బీఆర్ఎస్ లో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఆయన ఇంటికి వెళ్తా అన్నా. కండువా కప్పి స్వయంగా కేసీఆర్ వద్దకు తీసుకెళ్తా అని చెప్పా. దాంట్లో తప్పు ఏమున్నది? ఒక బాధ్యతగల ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీ మాట్లాడలేదని ప్రజలు గమనించాలి. పైగా అరెకపూడి గాంధీ ఫాలోవర్లు నా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. నేను ఉన్న విల్లాల్లో 69 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు మా కమ్యూనిటీలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు. నా ఇంటి అద్దాలు, కారు అద్దాలు పగలగొట్టారు, రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. కేసీఆర్, కేటీఆర్ ముఖం చూసి అరెకపూడి గాంధీకి ఓట్లు వేశారు ప్రజలు. ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, ఆంధ్ర, తెలంగాణను విడగొడుతున్నారు. 


రేవంత్ ను మించి కౌశిక్ ఎదిగాడు
‘‘హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారు. హైదరాబాద్ ను డ్యామేజ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు... ఎందుకంటే మీ స్థాయికి మించి కౌశిక్ రెడ్డి ఎదిగిపోయాడు. ఈ కౌశిక్ రెడ్డి చావడానికైనా రెడీ. మీ బెదిరింపులకు కౌశిక్ రెడ్డి భయపడడు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. నిన్న నాతో పాటు వచ్చిన హరీష్ రావును ఎట్లా అరెస్ట్ చేస్తారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాక మేం వదిలేదిలేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ముగ్గురు డిస్‌క్యాలిఫై అవుతారు.. స్పీకర్ చెప్పక ముందే వారు రాజీనామా చేయాలి.