టీఆర్ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 2013లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన టీఆర్ఎస్‌లో చేరి చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. గతేడాది మార్చిలో కాంగ్రెస్‌లో నాయకత్వలోపం ఉందంటూ పార్టీకి రాజీనామా చేసేశారు. అయితే, ఈయన్ను బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. జులై 1వ తేదీన కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని చెబుతున్నారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండాను బుధవారం ఓ హోటల్ లో కలిసినట్లుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వారు ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరడంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఉన్న సందేహాలను జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించి క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన ఓకే అన్నట్లుగా సమాచారం. దీంతో 1వ తేదీన బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కేవీ రంగారెడ్డి మనవడే కొండా విశ్వేశ్వర రెడ్డి. టీఆర్‌ఎస్ తరపున 16వ లోక్ సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్నప్పుడు అమెరికా పేటెంట్ పొందిన ఏకైక భారత పార్లమెంటేరియన్ ఈయనే కావడం విశేషం. అంతేకాదు 2014, 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన ఆఫిడవిట్ ఆధారంగా అత్యంత రిచ్చెస్ట్ పొలిటీషియన్‌గా నిలిచారు. అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు ప్రతాప్ సి. రెడ్డి కుమార్తె అయిన సంగీతా రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి భార్యాభర్తలు.
గతేడాది బీజేపీలో చేరతారని ప్రచారం
అయితే, గతేడాది ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురై బీజేపీలో చేరిన సందర్భంగా ఈయన కూడా కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ విపరీతమైన వార్తలు వచ్చాయి. అందుకు బలం చేకూరుస్తూ ఈటల రాజేందర్ ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలవడం, బండి సంజయ్ కూడా సమావేశం కావడం వంటి పరిణామాలు జరిగాయి. కానీ, ఆయన అప్పుడు బీజేపీలో చేరలేదు. తాజాగా, బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.