Owaisi Comments in Parliament: పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కొంపెల్ల మాధవీ లత స్పందించారు. ఒవైసీ పార్లమెంట్‌లో అల్లాహుఅక్బర్ తో పాటు జై పాలస్తీన్ అనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. అల్లా అన్న నోటితో జై పాలస్తీన్ అనడం ఏంటని.. అతని ఉద్దేశాలు ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల దేశ భద్రతకు ముప్పు అని.. తక్షణం ఇతణ్ని విచారణ చేయాల్సి ఉందని ఓ వీడియోను విడుదల చేశారు.


‘‘పార్లమెంటులో జై బోలో భారత్ మాతాకీ అనాల్సిన నోటి నుంచి జై పాలస్తీనా అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే.. దేశానికే దౌర్భాగ్యం. ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నందుకు 130 కోట్ల మంది భారతీయులు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. రజాకార్ల నుంచి వచ్చి.. వారిని చంపి వారి ఎంఐఎం పార్టీని కైవసం చేసుకొని గత 40 నుంచి 50 ఏళ్ల నుంచి తెలంగాణలో పాలన చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో.. వీరికి మద్దతివ్వడం ఆనవాయితీగా వస్తోంది.


తమ్ముడు చిటికె వేస్తాడు.. 15 నిమిషాల్లో ఖబడ్దార్ ఈ దేశాన్ని శ్మశానం చేస్తా అంటాడు. నేను ఆపాను కాబట్టే అతను ఆగుతున్నాడు.. లేదంటే ఏం చేస్తాడో చూస్కోండి అని అన్న అంటాడు. వీరు ఏం చేస్తారు? జై పాలస్తీన్ అని పార్లమెంట్‌లో అన్నప్పుడు వీరి మనస్తత్వం ఏంటి? ఇలాంటి వారిని మనం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం. ప్రశ్నించేవారు లేరా? ఈ దేశ సంరక్షణ ఏ దిశగా వెళ్తోంది. 130 కోట్ల జనాభా మధ్యలో ఇలాంటి వారు మనతో ఉండడమే కాకుండా.. అక్రమ మార్గంలో ప్రజాప్రతినిధులై పార్లమెంటులో కూర్చొంటే దానికి రక్షణ ఎక్కడుంది? వీరు హమాస్ వాళ్లా? వారి కోసం పని చేస్తారా? హమాస్ ఆశయాలను భారత దేశంలో అమలు చేయడానికో.. లేదా వారిని సంత్రుప్తి పర్చడం కోసం ఇక్కడ పని చేస్తున్నారా? 


ఏ దేశంలో అయినా పుట్టిన వారు అదే తన మాతృభాష, మాతృభూమిని పాటించి, అదే తన జీవిత లక్ష్యం అని అనుకుంటారు. వీరి ఉద్దేశం అలా లేదు. వీరెప్పుడూ పేరు, ప్రఖ్యాతి, డబ్బు కోసం పరితపించే వికృతమైన వ్యక్తులు వీరు. భగవత్ నామం అల్లా అని పేరు చెప్పి.. జై పాలస్తీన్ అన్నాడంటే.. అతని మనస్సులోంచి వచ్చిన మాటలివి. అతను ఎందుకు ఈ మాటలు అన్నాడు. కచ్చితంగా జాతీయ భద్రతా మండలి వారు ఒవైసీని కూర్చోబెట్టి ప్రశ్నించాలి. అతని మదిలో ఏ ఆలోచనలు ఉన్నాయో తేల్చాలి. ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే, పరిష్కరించుకోకపోతే.. ఈ భారత్ శత్రువులకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది’’ అని మాధవీ లత అన్నారు.