Kokapet: కోకాపేట.. ఈ పేరు గత కొద్ది రోజులుగా బాగా వార్తల్లో ఉంటోంది. ఎందుకుంటే హైదరాబాద్‌లో అత్యంత కాస్ట్‌లీ ఏరియా అవబోతోంది. నిన్న, మొన్న దాకా కోకాపేటలో ఎకరా రూ.40 కోట్లు వరకు ఉండేది. అయితే ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఒక్కసారిగా ఎకరా 80 నుంచి 90 కోట్లకు చేరింది. కొద్ది నెలల్లోనే ఇక్కడి భూముల రేట్లు 100 శాతం పెరిగాయి. ఐటీ బెల్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ ఏరియా దేశంలోనే రిచెస్ట్ ప్రాంతంగా గుర్తింపు పొందుతోంది. బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, పూణేతో పోలిస్తే కోకాపేట భూముల రేట్లు అత్యధికంగా ఉన్నాయి.
పొరుగున ఉన్న బెంగళూరులో, వైట్‌ఫీల్డ్స్, ఎలక్ట్రానిక్ సిటీ, సర్జాపూర్ రోడ్ వంటి ప్రముఖ ఐటీ ప్రాంతంలో సగటు భూమి ధరలు రూ.30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల మధ్యలో ఉన్నాయి. ఒకటీ అరా ఒప్పందాలు రూ.60 కోట్ల వరకు వెళ్లాయి. ఈ మొత్తం కూడా హైదరాబాద్‌తో పోలిస్తే రూ.20 కోట్లు నుంచి 50 కోట్లు వరకు తక్కువ. బెంగుళూరును దాటి హైదరాబాద్‌ను భారత ఐటీ రాజధానిగా మార్చడానికి ఈ భూముల ధరలు ప్రతికూలంగా మారాయని, పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ సుమంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ బాటలోనే ముంబై రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఐటీ విస్తరణ పన్వేల్, ఐరోలి మధ్య ఐటీ విస్తరించబోతోంది. అక్కడ ఎకరా రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు పలుకుతోంది. అంతే కాదు, మంచి రోడ్లు, రైల్వే నెట్‌వర్క్, మెట్రో లైన్‌కూడా ఉండడంతో రవాణాకు అనుకూలంగా ఉంటుంది. IT ఉద్యోగాల కోసం వస్తున్న వారికి సరసమైన ధరల్లో నివసాలు అద్దెకు దొరుకుతున్నాయని పాన్-ఇండియా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సిరిల్ డైరెక్టర్ సంజయ్ పూరి అన్నారు.
ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) పరిమితి లేకపోవడమే హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలకు కారణమని చెప్పవచ్చు. భారతదేశంలో ఎఫ్‌ఎస్‌ఐ పరిమితి లేని ఏకైక నగరం హైదరాబాద్ అని, తద్వారా బిల్డర్‌లు కొంత స్థలంలో తమకు కావలసినంత నిర్మించుకునే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రాపర్టీ కన్సల్టెంట్ మాట్లాడుతూ.. ‘కోకాపేట్‌లో తక్కువ కనెక్టివిటీ ఉన్నా భూములు రేట్లు పలకడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ రోడ్డు, రైలు వసతులు లేవు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర అవసరమైన సేవలు లేవు. దాదాపు 10 కి.మీ దూరంలో రాయదుర్గ్ సమీప మెట్రో స్టేషన్ ఉంది. అక్కడికి బస్సులు కూడా చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న రేట్లతో కోకాపేట్‌లో అద్దెలు రూ.40,000 నుంచి రూ.45,000 మధ్య ప్రారంభమవుతాయి. ఇది మధ్యతరగతి వారు భరించలేరు’ అని అభిప్రాయపడ్డారు.
కొత్త ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్ ప్రారంభించినా అక్కడికి మెట్రో రావడానికి మూడేళ్లు పడుతుంది. కోకాపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో నార్సింగి వద్ద స్టాప్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం చెన్నైలో ఇదే పరిస్థితి. టెక్ కారిడార్‌గా పేర్కొనబడే మహాబలిపురం రోడ్ (OMR) ఇంకా మెట్రో లైన్‌ను నోచుకోలేదు. కానీ అక్కడ అవసరమైన సేవలు, రిటైల్ అవుట్‌లెట్‌లతో అన్ని వసతులు ఉన్నాయి. అక్కడి రియల్టర్ల లెక్కల ప్రకారం OMRకు 2 కిమీ పరిధిలో ఎకరాకు రూ.60 కోట్లు పలికింది.
ఈ భూముల పెరుగుదల ఆరోగ్యకరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి సరైనవి కావని సిరిల్, ట్రినిటీ పార్ట్‌నర్స్ కోఫౌండర్ అజు థామస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి, అందరికి ఇళ్ల నిర్మాణంపై దృష్టిసారించాలని, పశ్చిమ హైదరాబాద్‌ను అభివృద్ధిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం ఆదర్శనీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.