మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తాను మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి చూసొచ్చానని, అది కుంగిపోవడమే కాకుండా పిల్లర్లకు కూడా పగుళ్లు వచ్చాయని అన్నారు. అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని తెలిపారు. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని, రూ.1.3 లక్షల కోట్లకు పెంచారని, అయినా కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకా పూర్తి చెయ్యలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పిందే నిజమైందని అన్నారు. తానే సూపర్ ఇంజినీర్ అని సీఎం కేసీఅర్ భావిస్తున్నట్లుగా కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం (నవంబరు 5) కిషన్ రెడ్డి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణలో ఒకే కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో అస్సలు లేవని, పదేళ్లుగా ఒక్క టీచర్ పోస్టుని కూడా భర్తీ చేయలేదని అన్నారు. గ్రూప్ - 1 రద్దు కావడం వల్ల 30 లక్షల మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. హామీలు ఇవ్వడం, అమలు చేయకపోవడం, మోసం చేయడం లాంటివి సీఎం కేసీఆర్‌కి మొదటి నుంచి అలావాటేనని కిషన్ రెడ్డి అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ చెయ్యలేదని మరోసారి విమర్శించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని అన్నారు.
కొత్త సెక్రటేరియట్ కు ఎందుకు రారు
వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పి పాత సెక్రటేరియట్‌ను కూల్చేశారని, మరి కొత్తగా కట్టిన సెక్రటేరియట్‌కి సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలుద్దామంటే, మంత్రులకు కూడా వీలు పడడం లేదని చెప్పారు. ప్రజాస్వామ్య ఆందోళనలను సీఎం కేసీఆర్ అణచి వేయిస్తున్నారని అన్నారు. నియంతృత్వ, రాచరిక, దుర్మార్గపు ఆలోచనలతో బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌పై తెలంగాణ యువత ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్తో బీజేపీకి అసలు సంబంధమే లేదని.. ఎంఐఎంతో అంటకాగే పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. కామారెడ్డి, గజ్వేల్ రెండు చోట్లు కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఎన్నికల కోసం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను వసూల్ చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్నాటక నుండి తెలంగాణకు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.
వేగం పెంచిన బీజేపీ
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికే అగ్రనేతలతో ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసిన బీజేపీ.. మరో దఫా ప్రచారానికి ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రప్పించనున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో జరిగే సభలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బీజేపీ, జనసేనతో పోత్తు పెట్టుకుని వారికి 9 సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అమిత్ షా తెలంగాణలో కొన్ని సభల్లో పాల్గొన్నారు. ముందు ముందు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ ముఖ్య నాయకులను తెలంగాణకు రప్పించనున్నారు.