Kharge Hyderabad Visit: ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్‌లోని గాంధీభవన్ కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో మల్లికార్జున్ ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బోసురాజు, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్, హర్కర వేణు గోపాల్ తదితరులు ఉన్నారు. ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూడా ఉన్నారు.


గాందీ భవన్ కు రాగానే బాణా సంచాలు కాలుస్తూ.. స్వాగతం పలికారు. మల్లికార్జున్ ఖర్గేకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సపోర్ట్ ఉంది. మరింత సపోర్ట్‌ కోరేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. 






ఖర్గే తరఫున ప్రచారం చేసేందుకు మల్లు రవి రాజీనామా..


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్ష పదవికీ మాజీ ఎంపీ మల్లు రవి ఈ మధ్యే రాజీనామా కూడా చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున్ ఖర్గే తరఫున ప్రచారం చేసేందుకే ఈయన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనుకునే నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం ద్వారా పారదర్శకంగా వ్వవహరించవచ్చని వివరించారు. అయితే పార్టీ అధిష్టానం మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్ల రవి స్పష్టం చేశారు. 


ఖర్గేకు మాజీ ఎంపీ చింత మోహన్ సపోర్ట్...


కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, మధ్యలో కొంత వెనుకబడ్డ ఇప్పుడు పుంజు కుంటుందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ చింత మోహన్. 50 ఏళ్ల తరవాత ఒక దళిత నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నామని చెప్పారు. మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారని, కొన్ని కార్పోరేట్ శక్తులు దీన్ని అడ్డుకుంటున్నాయని చెప్పారు. శశిథరూర్ దళిత వ్యతిరేకి అని, ఆయనకు ఒక్క ఓటే వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు కార్పొరేట్లు ఖర్గేను వ్యతిరేకిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు.