TPCC chief Revanth Reddy: డిసెంబర్ 9న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో అదే తేదీన తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేయడం తెలిసిందే. ఆదివారం ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. 


తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది ఖమ్మం జిల్లానేనని రేవంత్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించేందుకు మళ్లీ ఖమ్మం నుంచి నాంది పలకాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ సభగా లక్షల మంది తరలి వచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టిందని, అంతా అవినీతిమయమేనని మండిపడ్డారు. తెలంగాణ పొలిమేరల నుంచి కేసీఆర్ కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఖమ్మం సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం బస్సులు ఇవ్వలేదని పోలీసులను, ప్రభుత్వాన్ని విమర్శించారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ గోడలను కూలగొట్టుకుంటూ ఖమ్మం సభకు తరలివచ్చారని చెప్పారు. 


ఖమ్మం జిల్లాలో సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే 109 రోజుల పాటు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మార్చ్ యాత్రలో దృష్టి కొచ్చిన అంశాలు మేనిఫెస్టో గా ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకుని.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందన్నారు.



వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ వివరించామన్నారు. ఖమ్మం జనగర్జన సభలో వృద్ధులకు రూ. 4వేల పింఛన్ ఇవ్వబోతున్నట్లు రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు.  అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి అనే రెండు పాదాలపై రాష్ట్రాన్ని నడిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి


తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 'చేయూత' పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా/ డయాలసిస్ పేషంట్లకు ప్రతీ నెలా రూ.4,000 పింఛను అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. 9 ఏళ్లపాటు మొత్తం అవినీతి చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. 9 ఏళ్లపాటు టీఆర్ఎస్ ప్రభుత్వం మీ కలల్ని నాశనం చేసింది. ఇప్పుడు చూస్తే వాళ్ల పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. బీజేపీకి బంధువుల సమితి పార్టీగా సీఎం కేసీఆర్ పేరు మార్చేశారని సెటైర్లు వేశారు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial