Hyderabad Techie Arrested: లగ్జరీ లైఫ్ కు అలవాటుపడ్డ టెకీ తెలివిగా చోరీలు చేయడం మొదలుపెట్టాడు. చోరీలు అంటే చిన్నాచితకా కాదండోయ్. ఏకంగా కోటి రూపాయల విలువ చేసే కార్లను చోరీ చేస్తున్న టెకీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.


అతడి పేరు బి అరుణ్ రెడ్డి. ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్ గా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కానీ లగ్జరీ లైఫ్ కావాలని ఆశపడ్డాడు. దాంతో తన తెలివిని ఉపయోగించి కోట్ల విలువ చేసే కార్లను చోరీ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు చేసి చివరికి కటకటాల పాలయ్యాడు ఆ టెకీ. కార్ల చోరీలకు పాల్పడుతున్న వెబ్ డిజైనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్ రెడ్డి రెండు బీఎండబ్ల్యూ కార్లు చోరీ చేసినట్టు గుర్తించారు. ఒక్కో కారు విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.  


డీసీపీ కె.శిల్పవల్లి మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. బి.అరుణ్ రెడ్డి అనే 29 ఏళ్ల యువకుడు వెబ్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫేమస్ సింగర్ బాద్షా కచేరీ సందర్భంగా ఈవెంట్ కు హాజరైన అరుణ్ రెడ్డి ఓ బీఎండబ్ల్యూ జడ్ 4 కారును చోరీ చేశాడని ఆమె తెలిపారు. జూన్ 24న ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు.


గత నెల చివరి వారంలో జరిగిన సింగర్ బాద్షా కచేరీకి హాజరయ్యేందుకు ఓ మహిళ లగ్జరీ కారులో వచ్చింది. ఆమె బీఎండబ్ల్యూ కారులో రావడంతో ఎలాగైనా కారు చోరీ చేయాలని అరుణ్ రెడ్డి ప్లాన్ చేశాడు. తాను అక్కడ కార్ పార్కింగ్ బాధ్యతలు చూస్తున్నానని ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన మహిళ కారు తాళాలు అరుణ్ రెడ్డికి ఇచ్చి ఈవెంట్ కు హాజరైంది. కారు తాళాలు తీసుకున్న టెకీ పార్కింగ్ చేయడానికి బదులుగా కారుతో పరారయ్యాడు. ఈవెంట్ ముగిశాక చెక్ చేస్తే తన కారు కనిపించకపోవడంతో మహిళ షాకైంది.


తన కారు చోరీ అయిందంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కోటి రూపాయల విలువ చేసే కారును, వ్యాలెట్ పార్కింగ్ పేరుతో నమ్మించి నిందితుడు చోరీ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ సేకరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వారం రోజులపాటు కారు ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు లగ్జరీ కారులో నిందితుడు షికార్లు చేశాడు. ఈ క్రమంలో కారును హోటల్ షెరాటన్ వద్ద పార్క్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అరుణ్ రెడ్డి కారు వద్దకు రాగానే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 


గత ఏడాది మరో లగ్జరీ కారు కూడా చోరీ చేశానని పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. గతేడాది బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కారు చోరీ చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. కుటుంబసభ్యులు అడిగితే సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వేరే రాష్ట్రాల నెంబర్ ప్లేట్ తో తిరుగుతూ నిందితుడు బురిడీ కొట్టిస్తున్నాడని డీసీపీ శిల్పవల్లి వివరించారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial