జన గర్జన సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ముందు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని సభాస్థలిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అయితే, ఖమ్మం సభకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ అంతకుముందు డీజీపీ అంజనీ కుమార్‌కు రేవంత్ హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా రేవంత్ వెంట ఉన్నారు. ఖమ్మం సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్‌ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ కోరారు. అయితే, సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు. 


అడ్డంకులు దాటుకొని అయినా సభకు హాజరవుతామని నేతలు స్పష్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి ఖమ్మం సభకు రేవంత్‌, మధుయాష్కీ బయల్దేరి వెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలను, వాహనాలను పోలీసులు అడ్డుకుంటే వెనకడుగు వేయొద్దని ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.