మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా రూ.37 వేలతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించారు. తనకు 5 కార్లు ఉండగా వాటికి వివిధ సందర్భాల్లో పడ్డ చలాన్లను తాజాగా తీర్చేశారు. ఆయన కార్లకు మొత్తం 66 చలాన్లు ఉన్నాయి. చలాన్ల రూపేణా పడిన ఫైన్ మొత్తం రూ.37,365. ఈ భారీ మొత్తాన్ని దానం నాగేందర్ తీర్చేసినట్లుగా బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శంకర్ నాయక్ వెల్లడించారు.
శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో దానం నాగేందర్‌కు చెందిన కారును పోలీసులు ఆపారు. ఆ కారుపై ఏకంగా రూ.5,175 విలువ గల చలానాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తన కారును ఆపిన విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో, ఆయన పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం వివాదాస్పదం అయింది. ఆయన ఫోన్ చేసి చెప్పగానే ట్రాఫిక్ పోలీసులు కారుని వదిలిపెట్టారు. ఈ విషయం వివాదస్పదం అయింది. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ తనకున్న వాహనాలకు సంబంధించిన చలాన్లను మొత్తం చెల్లించినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ అవ్వని వాహనాలు, అద్దాలపై బ్లాక్ ఫిల్మ్స్‌పై శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అప్పుడే టీఎస్ 09 ఎఫ్ఏ 0999 కారుపై ఉన్న 8 చలాన్లకు సంబంధించి నమోదైన రూ.5,175 కూడా ఉంది. దీంతో ఫైన్ కట్టాల్సిందిగా పోలీసులు డ్రైవర్‌ను కోరారు. తాజాగా ఎమ్మెల్యే స్పందించి మొత్తం చలానాలను క్లియర్ చేసేశారు.