Telangana News: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఆహ్వానం అందింది. దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థల్లో ఒక్కటైన ఐఐటీ మద్రాస్(IIT Madras) నుంచి  కీలక ఆహ్వానం వచ్చింది. ఐఐటీ మద్రాస్‌లో జరిగే ఎంట్రపెన్యురల్ ఫెస్టివల్ ఈ-సమ్మిట్‌(Entrepreneurial Festival e-Summit)లో పాల్గొని మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ నెల 9,10వ తేదీలలో ఈ సమ్మిట్ జరగనుంది. దీంతో దేశ, విదేశాల్లో ఎంట్రపెన్యురల్ రంగంలోని కీలక వ్యక్తులు, సంస్థల అధిపతులు, పాలసీ మేకర్లతో పాటు ప్రముఖ వ్యక్తులను ఐఐటీ మద్రాస్ ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా కేటీఆర్‌ను కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రిక పంపించారు.


ప్రతీ ఏటా ఐఐటీ మద్రాస్‌లో ఈ-సమ్మిట్


ఐఐటీ మద్రాస్‌లో ప్రతీ ఏటా ఈ-సమ్మిట్ నిర్వహిస్తారు. ఎంట్రపెన్యురల్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఔత్సాహికుల కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ వ్యక్తులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానిస్తూ ఉంటారు. దీని ద్వారా ఎంట్రపెన్యురల్ రంగంలోకి అడుగుపెట్టే ఔత్సాహికులను ప్రోత్సహించడంతో పాటు వారికి కావాల్సిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ప్రముఖ వ్యక్తులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. దీని వల్ల ఎంట్రపెన్యురల్ రంగంలోకి అడుగుపెట్టేవారికి ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఔత్సాహికులకు ప్రముఖ వ్యక్తులు పంచుకునే అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోగలుగుతారు.


హాజరుకానున్న కేంద్రమంత్రి


ఈ సమ్మిట్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ హాజరుకానున్నారు. అలాగే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి రానున్నారు. వారితో పాటు కేటీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కేటీఆర్ గౌరవం ఎప్పుడూ తగ్గదని చెప్పడానికి ఇదొక ఊదాహరణ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ రాజకీయ నాయకుడే కాదని, ఇతర అంశాలపై కూడా అవగాహన ఉందని అంటున్నారు. అందుకే  జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి  ఆయనకు ఎన్నో ఆహ్వానాలు వచ్చాయన్నారు. ఐఐటీ మద్రాస్ నిర్వహించే సమ్మిట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం రావడం గర్వనీయమని గులాబీ శ్రేణులు అంటున్నారు.


పర్యటనలతో కేటీఆర్ బిజీ బిజీ


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రోజు నుంచి కూడా కేటీఆర్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ లోక్‌సభ ఎన్నికలకు రెడీ చేస్తున్నారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతూ కార్యకర్తలకు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ విమర్శలకు రేవంత్ రెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఓడిపోయినా కూడా బీఆర్ఎస్ నేతల తీరు మారలేదంటూ విమర్శిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శల, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ పెరుగుతోందని చెప్పవచ్చు.