CH Mallareddy: తెలంగాణలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న నేతలు ఉన్నపలంగా కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా కొనియాడిన ఎంతో మంది నేతలు ఇప్పుడు.. అధికారం కోల్పోగానే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక పదవులు అనుభవించిన ఎంతో మంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోగా, మరింత మంది ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారని చెబుతున్నారు. ఆయన కాదు అంటున్నా.. ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ను మల్లారెడ్డి కలవడం ఆసక్తిని కలిగిస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే మల్లారెడ్డి శుక్రవారం సాయంత్రం కలిశారు. వీరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశంతోపాటు మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం కేటాయింపు, రాజశేఖర్‌ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు. 


కేసీఆర్‌ కబురుతో వెళ్లిన మల్లారెడ్డి


మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో బీఆర్‌ఎస్‌ పార్టీ అప్రమత్తమైంది. పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా మల్లారెడ్డికి కబురు పంపించారు. కేసీఆర్‌ పంపించిన కబురుతో నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. గురువారం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి మల్లారెడ్డి భేటీ అవడంపై చర్చించారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపైనా కేసీఆర్‌ ఆరా తీశారు. తాను పార్టీ మారబోనని కేసీఆర్‌తో మల్లారెడ్డి తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని కేసీఆర్‌తో మల్లారెడ్డి చెప్పినట్టు చెబుతున్నారు. అదే సమయంలో మల్కాజగిరి ఎంపీ సీటును కూడా మల్లారెడ్డి వద్దన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీటును ఇంకెవరికైనా ఇవ్వాలని కూడా ఆయన సూచించినట్టు తెలుస్తోంది. మల్కాజగిరి ఎంపీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ నుంచి మల్లారెడ్డి కుమారుడు బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ, మల్లారెడ్డి అందుకు సుముఖంగా లేకపోవడంతో మరో అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌ వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.