పార్లమెంట్ వేదికగా కేంద్రంతో యుద్ధం చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూనే... దర్యాప్తు సంస్థలతో ఆడుతున్న ఆటను కూడా ప్రజల ముందు ఉంచాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్ వేదికగా పోరాటాలకు రెడీ అవ్వాలని సూచించారు. ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలని అన్నారు.
రేపటి(బుధవారం) నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లను స్తంభింపజేయాలని ఎంపీలకు సూచించారు. బీజేపీ రాజకీయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీలలో ఎంపీలతోపాటు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను అడుగడుగునా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు కేసీఆర్. అంతులేని వివక్ష, ఆంక్షలు విధించడమే కాకుండా ఇక్కడ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. అభివృద్ధి అడ్డుకోవడమే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే పన్నాగానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇదంతా దేశానికి తెలియజేయాలని ఎంపీలకు హితబోధ చేశారు.
బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలు, విభజన హామీలు అమలుపై పార్లమెంట్ సాక్షిగానే తేల్చుకోవాలన్నారు కేసిఆర్. సభలో నిరసన తెలపాలని సూచించారు. పార్లమెంట్ బయట కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, బీజేపీ నిరంకుశ వైఖరిని దేశానికి చెప్పాలని సూచించారు. కలిసొచ్చే ఎంపీలతో కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో ద్వంద్వవైఖరి, ఆర్థికపరమైన అంశాల్లో అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలన్నారు.
ప్రశ్నిస్తున్న వారినే లక్ష్యంగా చేసుకొని కేంద్ర సంస్థలను ఉసిగొల్పి ఆడుతున్న ఆటను ప్రజలకు తెలియజేయాలన్నారు కేసీఆర్. ప్రభుత్వాలను కూలగొట్టే సాధనాలుగా వాటిని మార్చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వచ్చి దొరికిపోయి... దాన్ని పక్కదారి పట్టించేందుకు దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపిందన్నారు. దీనిపై ఎంపీలు గళమెత్తాలన్నారు.
తెలంగాణ సచివాలయ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టినట్టే పార్లమెంటు కొత్త భవనానికీ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు కేసీఆర్. గిరిజన, ముస్లిం రిజర్వేషన్ల పెంపు, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసం తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాలను పట్టించుకోకపోవడం, కొత్త ప్రాజెక్టులు ఇవ్వకపోవడం వంటి వాటిపైనా నిలదీయాలన్నారు.
డిసెంబర్ 10 కేబినెట్ భేటీ
డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణంపై ప్రభుత్వం అందించే సాయం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.