BRS Chief KCR: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడుగా ఆయన అందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రామోజీరావు గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి అని, ఆయన మరణం బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. రామోజీరావు జీవితం స్ఫూర్తిదాయకమన్న ఆయన.. తెలుగు మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్రవేశారన్నారు. ఎంతో ఆప్యాయత కలిగిన వ్యక్తి రామోజీరావు అన్న కేటీఆర్.. అతని మంచి మాటలను తాను ఎల్లప్పుడూ గౌరవించానన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులు స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హరీష్ రావు నివాళి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహానికి హరీష్ రావు నివాళులర్పించారు. రామోజీరావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా రామోజీరావు మరణం తీరని లోటని పేర్కొన్నారు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శమని.. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. తెలుగువాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులని పేర్కొన్నారు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా హరీష్ రావు పేర్కొన్నారు. 'రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు, వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపారు. తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది. జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి ఎనలేనిది.' అని హరీష్ రావు పేర్కొన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.