Sadness In Ramoji Rao Home Town: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్, మీడియా దిగ్గజం రామోజీరావు (Ramojirao) అస్తమయం అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో కృష్ణా (Krishna) జిల్లా పామర్రులోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో (Pedaparupudi) విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విన్న గ్రామస్థులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. జోహార్ రామోజీరావు అంటూ గ్రామం మధ్యలో గ్రామస్థులు నినాదాలు చేశారు. ఆయన్ను కడసారి చూసేందుకు రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీకి బయలుదేరారు. కాగా, రామోజీరావు తన స్వగ్రామమైన పెదపారుపూడిని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. రూ.20 కోట్లకు పైగా సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. విద్యార్థి దశ నుంచే ఆయనది కష్టపడే తత్వమని.. రామోజీరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన బాల్యమిత్రుడు పాలడుగు చంద్రశేఖర్ రావు గుర్తు చేసుకున్నారు. దేశంలోనే ఉన్నత స్థాయికి ఎదిగినా.. పుట్టిన ఊరుని మర్చిపోకుండా సేవ చేశారని కొనియాడారు. 


మోడల్ గ్రామంగా..


పెదపారుపూడి కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని.. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మోడల్ గ్రామంగా అభివృద్ధి చేశారని రామోజీరావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గ్రామంలో శ్మశానాల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకూ ఎన్నో నిర్మాణాలు చేపట్టారని.. సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటని కన్నీటితో నివాళి అర్పించారు.


రామోజీరావు కుటుంబ నేపథ్యం


కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్‌ 16న సాధారణ రైతు కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన చేపట్టిన ఏ ప్రాజెక్టు అయినా కచ్చితంగా ప్రజాదరణ పొందుతుందీ అంటే ఆయన కృషి అలాంటిది. 1974లో ఏర్పాటు చేసిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పెను సంచలనం. అప్పుడే కాదు నేటికీ ఆ పేపర్‌ ప్రజల మనసులకు దగ్గరగా ఉంది. మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలైన వ్యాపార సంస్థలు ప్రారంభించి విజయవంతంగా నడిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు. రామోజీరావు అంటేనే సమయపాలన, క్రమశిక్షణకు మారుపేరు అంటారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2016లో దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌ అందించి గౌరవించింది.


Also Read: Ramoji Rao: వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన రామోజీరావు జీవితం స్ఫూర్తిదాయకం- రాష్ట్రపతి సహా ప్రముఖుల ఘన నివాళి