దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొనే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పాల్గోనున్నారు. జనవరి 2 , 3 తీదీల్లో కేరళ వేదికగా ఈ ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ జరగనుంది. రెండు రోజుల పాటు కవిత కేరళలో పర్యటించనున్నారు. 


జనవరి 2, 3వ తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌లో పాల్గొంటారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పలికారు. 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో కూడా ఆమె ప్రసగించనున్నారు. 






ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరవుతారు.


ఏంటీ ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్‌?


దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజాస్వామ్యం బలోపేతం చేయడానికి  గ్రంథాలయాల్లో రావాల్సిన మార్పులు, ప్రజలను గ్రంథాలయాలవైపు తీసుకెళ్లి దేశాభివృద్ధిలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసే ఆలోచనతో ఇండియన్ లైైబ్రరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. స్థిరమైన, సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచనలను రూపొందించడానికి ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ తీవ్రమైన చర్చలకు వేదికగా భావిస్తున్నారు.


అనుభవాల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అలాంటి అనుభవాలకు ఈ కాంగ్రెస్ వేదిక అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో లైబ్రరీలు సామూహిక అభ్యాసానికి సంబంధించిన ప్రదేశాలుగా మారాల్సిన అవసరం ఉంది. అట్టడుగు, అణగారిన వర్గాలు, ఆయా ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే గ్రంథాలయాలను స్థాపించాలనే ఉద్యమాన్ని ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ బలోపేతం చేస్తుంది.


ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమస్యలను వివిధ కోణాల్లో చూస్తుంది. వాటి పరిష్కారానికి మెరుగైన వ్యూహాన్ని రూపొందిస్తుంది. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ అనేది అనేక ప్రభుత్వ సంస్థల జాయింట్ వెంచర్‌. ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాలపై చర్చకు వేదికగా, లైబ్రరీ నిపుణులు, ఉపాధ్యాయులు, లైబ్రేరియన్లు, విద్యార్థులు, పరిశోధకులు, ప్రజాప్రతినిధులు, రచయితలు, కళాకారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తిగల వ్యక్తులతో సహా అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. వీళ్లంతా 2023 జనవరి 1-3 వరకు కన్నూర్‌లో ఒకే వేదికపైకి వచ్చి తమ అభిప్రాయాలను చెప్పనున్నారు. 


భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన కన్నూర్ విశ్వవిద్యాలయం... లైబ్రరీ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇస్తుంది. సుదీర్ఘ సముద్రతీరంతోపాటు కొండ ప్రాంతాలు, మిడ్‌ల్యాండ్‌తోపాటు సమృద్ధిగా ఉన్న జీవవైవిధ్యం, స్థానిక సంప్రదాయాలతో, కన్నూర్ అద్భుతమైన ప్రకృతి దృశ్యాల సుందరమైన ప్రదేశం.