పదవికి రాజీనామా చేయడంపై తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పందించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం పట్ల.. తాను పార్టీలో ఉండి క్యాడర్ కు న్యాయం చేయలేనని అన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రేపు తన క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదనేది చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. లోకేశ్ ని అడిగితే చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని.. ఇక్కడ ఎం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదని అన్నారు. ఆంధ్రలో టీడీపీ జనసేనతో పొత్తు ఉంటే.. తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు ఉండడం.. ఇదేం బొమ్మలాట అని తప్పుబట్టారు.
‘‘చంద్రబాబు కోరితే ఖమ్మంలో మీటింగ్ పెట్టాను. తర్వాత నిజామాబాద్ లో మీటింగ్ పెట్టాలన్నారు. ఇంటింటికీ టీడీపీ అని, 41వ ఆవిర్భావ సభ పెట్టించారు. చంద్రబాబును జైల్లో కలిసి వచ్చా. ఈ మధ్య లోకేష్ కి ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. తెలంగాణలో అభ్యర్థులు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అభ్యర్థులు సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంతలో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నిలబడటం లేదని చెప్పారు. మరి నన్ను ఎందుకు పార్టీలోకి పిలిచారు అని చంద్రబాబును అడిగాను.
‘‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాదాపు 60 మంది అభ్యర్థులు తయారయి ఉన్నారు. వాళ్లతో పాటు క్యాడర్ కు పార్టీలో ఉండి నేను న్యాయం చేయలేను. అందుకే టీడీపీకి రాజీనామ చేస్తున్నా. రేపు నా క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకు పోటీ చేయట్లేదు అనేది చంద్రబాబు చెప్పడం లేదు. లోకేష్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు. ఆంధ్రలో టీడీపీ - జనసేనతో పొత్తు.. తెలంగాణలో జనసేన, బీజేపీతో పొత్తు.. ఇదేం బొమ్మలాట?
లోకేష్ ఏం మాట్లాడతాడో లోకేష్ కే తెలియాలి? తెలంగాణతో సంబంధం లేదు అని లోకేష్ అన్నాడట. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ భవన్ కి వచ్చారు.. తడాఖా చూపిద్దాం అన్నారు.. ఇప్పుడు బాలయ్య కూడా పట్టించుకోవడం లేదు.. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. నేను చిల్లిగవ్వ కూడా పార్టీ నుంచి తీసుకోలేదు.. అన్నిటికీ నేనే ఖర్చు చేశా’’ అని కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.