ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రష్మికా మండన్నా వీడియో గురించి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. రష్మిక మండన్న డీప్ ఫేక్ వీడియోపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని కవిత కోరారు. తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రక్షణ చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎక్స్ ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి భవన్ ను కూడా కవిత ట్యాగ్ చేశారు.
నిజం వీడియో అనుకున్న నెటిజన్లు
రష్మిక మందనా పేరుతో ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేసినట్లు ఉంది. వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది రియల్ వీడియో అనుకున్నారు. కానీ అది ఫేక్ వీడియో అని తేలడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని చూసి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియో అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మండన్నా సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ఇలాంటి ఫేక్ వీడియోనే నేను కాలేజీ లేదా స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నాకు తెలిసేది కాదు. ఒక మహిళగా అందులోనూ నటిగా నన్నెంతో సపోర్ట్ చేస్తున్న కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్. మన గుర్తింపునకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై మనం కలసికట్టుగా వెంటనే స్పందించాలి’’ అని రష్మిక స్పందించారు.
స్పందించిన కేంద్రం
మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని అన్నారు.