దేశంలో ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పరిణామాలు జరుగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేసేయడం సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ లాంటి జగమొండితోనే దేశంలో మంచి చేయడం కుదురుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా రాజీవ్ సాగర్‌ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పెద్దలు కేసీఆర్ ఆశీర్వాదంతో రాజీవ్ కి మంచి గుర్తింపు, పొజిషన్ రావడం చాలా సంతోషకరం. రాజీవ్ సాగర్ కి వచ్చిన గుర్తింపు జాగృతి కార్యకర్తలకు, తెలంగాణ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న యువ మిత్రులకు వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. 


కష్టపడి, నిరంతరం సమాజం కోసం పని చేస్తే తప్పక గుర్తింపు వస్తుందని అనడానికి రాజీవ్ సాగర్ ప్రత్యక్ష ఉదాహరణ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజీవ్ కు వచ్చిన ఈ గుర్తింపు అందరికి స్ఫూర్తి అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసేవారికి తగిన గుర్తింపు తప్పకుండా వస్తుందని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మన ప్రజల కోసం మన ప్రాంతం బాగుపడాలని మనం ఉద్యమం చేశామని అన్నారు. 


‘‘గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని మనం చూస్తున్నాము. ఒకప్పుడు రైతు కళ్లలో కనీళ్లు ఉంటే ఇప్పుడు అదే రైతు పొలంలో కాళేశ్వరం నీళ్లున్నాయి. సీఎం కేసీఆర్ మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం మాములు విషయం కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కొంతమంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఉద్యమం సమయంలో ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలుసు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా వాళ్ళని కోనరు అలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాక్కులు చేవాక్కులు పేలుతున్నారు. కేసీఆర్ తో కలిసి నడిచేవారికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఆ నమ్మకం ఉంది.


మనం అందరం సైద్ధాంతికరమైన రాజకీయాలు చేయాలి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజాస్వామ్యం కూని చేసే రాజకీయాలు దేశంలో నడుస్తున్నాయి. అవన్నీ తిప్పికొట్టాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం. కేసీఆర్ లాంటి జగమొండి తోనే సాధ్యం. ఇక ముందు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలి దేశంలో మన పాత్ర కీలకంగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాలి. పని చేసే కార్యకర్తలు సమయం కోసం వేచి చూడాలి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది’’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.