Kalvakuntla Kavitha Comments on Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బీజేపీ సహకారంతో పదేళ్ల పాటు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పారు. ఇది ప్రజా పాలన కాదు... ప్రజా వ్యతిరేక పాలన అని ధ్వజమెత్తారు. జీవో 3కి వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించాల్సిందేనని, అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని తేల్చిచెప్పారు. 


గురువారం (మార్చి 7) ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విలేకరులతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు తరతరాల పాటు నష్టం జరిగే చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 8న ధర్నాను తలపెట్టామని, కానీ ఇప్పటి వరకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అనుమతి వస్తే రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు జీవో 3 వల్ల నియామకాల్లో జరిగే నష్టం గురించి వివరించాలని భావించామని అన్నారు. జీవో 3 మహిళలకు నియామకాల్లో అన్యాయం చేయడం దారుణమని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా మారబోతుందని తెలిపారు. మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉద్యోగావకాశాలకు గండి కొడుతున్నారని తెలిపారు. ప్రజా పాలనలో ఎవరైనా ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి అన్నారని, ఆ మాట మీద నిలబడితే తమకు అనుమతి ఇవ్వాలని తేల్చిచెప్పారు. తాము శాంతియుతంగానే ధర్నాను నిర్వహిస్తామని అన్నారు. పోలీసులు అనుమతించకపోయినా ధర్నా చేసే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. ధైర్యం ఉంటే అనుమతి ఇవ్వాలని సూచించారు. 


కరువు వచ్చిందని, ఎవరూ తాగునీళ్లు, సాగునీళ్లు అడగవద్దని ముఖ్యమంత్రి అన్నట్లు అన్ని పత్రికల్లో వార్త వచ్చిందని ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.... “ఇది కరువు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును, కేసీఆర్ ను బద్నాం చేయాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి సృష్టించిన కృత్రిమ కరువు ” అని వ్యాఖ్యానించారు. అవగాహనరాహిత్యంతో ప్రభుత్వం చెరువులను నింపలేకపోయిందని, దాంతో ఆ నెపాన్ని ప్రకృతి వైపరిత్యంగా చిత్రీకరిస్తున్నామని మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఇబ్బంది పడవద్దన్న భావనతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. ప్రాజెక్టులో ఎమైనా చిన్న చిన్న సమస్యలుంటే మరమ్మత్తు చేయాలని, కానీ పొలాలు ఎండబెట్టి రైతులకు అన్యాయం చేయడం దారుణమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి అనుభవం లేమి కారణంగా రైతులు, ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ అంశాలను తప్పా ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల కోణంలోనే సీఎం మాట్లాడుతున్నారని, బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కూడా సీఎం స్పందించలేదని అన్నారు.  


ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్ధేశం లేదని అందరూ చెబుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నట్లు దారుణాతి దారుణమైన పదజాలంతో కేసీఆర్ ను అనేక సార్లు దూషించడం సరికాదని సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రతిపక్షాలను పదే పదే బెదిరించడం అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్రంలో పోలీసులు స్వేచ్ఛతో పనిచేస్తే ముఖ్యమంత్రిపై వందల కేసులు పెట్టాల్సి ఉండేదన్నారు. అంతు చూస్తామని... మానవ బాంబులవుతారని ముఖ్యమంత్రి మాట్లాడడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. 


బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని శపథం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో అర్వింద్ ను ఓడించానని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓడిస్తానని, అదే తన ఎజెండా అని స్పష్టం చేశారు. అయితే, తాను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.  అలాగే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బొందపెట్టాలని చూస్తున్నారని, అది ఆ పార్టీలతో సాధ్యం కాదని తేల్చిచెప్పారు.