Half Day Schools in Telangana: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. విద్యాశాఖ(Educational Department) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి15 నుంచి ఒంటిపూట బడులు(Half Day Schools) నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాలలకు ఒంటిపూట బడులపై విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసింది.
ఏప్రిల్ మూడోవారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మధ్యా హ్నం 12.30 గంటలకు అందజేస్తారు. ఈ స్కూళ్లలో ముందుగా మధ్యాహ్నం భోజనం అందజేసి.. ఆ తర్వాత తరగతులు కొనసాగించనున్నారు. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత..యథావిథిగా ఉదయంపూట తరగతులు నిర్వహించనున్నారని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
అలాగే.. తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష జరిగే కేంద్రాల్లో మధ్యాహ్నం తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా విద్యాశాఖ హాఫ్ డేస్ ప్రకటించింది. మార్చి 15 నుంచి ఈ విద్యా సంవత్సవంలో చివరి పని దినం ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు అంటే ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు పనిచేస్తాయని పేర్కొంది.
మార్చి 18 నుంచి పదోతరగతి పరీక్షలు..
తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు (TS SSC Exams) నిర్వహించనున్నారు. మార్చి 30తో ప్రధాన పరీక్షలు, ఏప్రిల్ 2తో ఒకేషనల్ పరీక్షలు (Telangana 10th Class Exams) ముగియనున్నాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
పరీక్ష తేదీ | పేపరు |
మార్చి 18 | ఫస్ట్ లాంగ్వేజ్ |
మార్చి 19 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 21 | థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్) |
మార్చి 23 | మ్యాథమెటిక్స్ |
మార్చి 26 | ఫిజికల్ సైన్స్ |
మార్చి 28 | బయాలజికల్ సైన్స్ |
మార్చి 30 | సోషల్ స్టడీస్ |
ఏప్రిల్ 1 | ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు |
ఏప్రిల్ 2 | ఓరియంటెల్ పేపర్-2 |