మంత్రి కేటీఆర్ తాను ఇంకా సీఎం కాలేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కేటీఆర్‌ సంస్కారం లేకుండా నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికలంటే మద్యం ఏరులై పారడం, డబ్బు అంటే మద్యం, డబ్బు అయిపోయిందని విమర్శించారు.


కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌వి అవకాశవాద రాజకీయాలని విమర్శలు చేశారు. ఈ నెల 16 తర్వాత బీజేపీ లిస్ట్‌ కూడా వస్తుందని కె.లక్ష్మణ్‌ తెలిపారు. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పారు. నోటిఫికేషన్‌ లోపే మేనిఫెస్టో, చార్జిషీట్‌ కూడా విడుదల చేస్తామని చెప్పారు.


ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా ఎక్కడ.. కేటీఆర్‌ ఎక్కడని అన్నారు. పెద్ద వారిని తిడితే పెద్దవాడు అవుతానని అనుకుంటున్నావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయని.. ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు గుంజుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదులకు నడక నేర్పడమేమో కానీ మద్యాన్ని ఏరులై పారించారని అన్నారు. గుజరాత్ కు వెళ్లి చూసి వస్తారని.. అదే గుజరాత్ మోడల్‌ని ఎగతాళి చేస్తుంటారని లక్ష్మణ్‌ విమర్శించారు.