బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం (అక్టోబరు 12) నాడు చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్‌వర్క్ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్’లో కవిత పాల్గొంటారు. ఈ సమ్మిట్ లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం నాడు రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి జరిగే చర్చా వేదికలో పాలుపంచుకుని కవిత తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉదయనిధి స్టాలిన్, దగ్గుబాటి రాణా, కల్వకుంట్ల కవిత, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎంవీ రాజీవ్ గౌడ, కుష్భూసుందర్ ,సుహాసిని మణిరత్నం సహా దక్షిణాది రాష్ట్రాలకు చెంది.. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు ప్రముఖులు సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. దేశ పురోభివృద్ధిలో దక్షిణాది పోషించిన.. పోషించబోయే పాత్ర.. ఎుదరయ్యే సవాళ్లు వంటి వాటిపై మనోభావాలను ఆవిష్కరించనున్నారు. 


భారత దేశంలో దక్షిణాది రాష్ట్రాది ఓ ప్రత్యేకమైన స్థానం. పురోగామి రాష్ట్రాలు దేశం మొత్తం పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. భాషలు కూడా వేర్వేరు. రాజకీయంగానూ భిన్నమైన పంథాలతో వెళ్తూంటాయి. దేశ రాజకీయాలన్నీ ఓ దిశగా వెళ్తూంటే దక్షిణాది ప్రజలు మరింత భిన్నంగా ఆలోచిస్తారు. ప్రాంతీయతే పెద్ద పీటవేస్తారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఏకాభిప్రాయానికి రావడానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఓ కారణం.  


దేశంలో తలసి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉంటాయి. తలసరి ఆదాయంలో టాప్‌-5 స్థానాల్లో దక్షిణాది రాష్ర్టాలే ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ర్టాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. జనాభాను నియంత్రించాలన్న పిలుపునకు ఈ రాష్ట్రాలు అద్భుతంగా స్పందించాయి. మంచి ఫలితాలు సాధించాయి. ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసినా ప్రపంచం మొత్తం వాటి గురించి మాట్లాడేలా చేయడంలో  దక్షిణాది చిత్ర పరిశ్రమలు అనూహ్య విజయాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు  బాలీవుడ్‌కు బ్లాక్  బస్టర్లు అందిస్తోంది కూడా దక్షిణాది టెక్నిషియన్సే అంటే.. ఎంతగా చొచ్చుకు వచ్చేశారో అర్థం చేసుకోవచ్చు.