Complaint Against KTR To CEC:
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లను డబ్బులు తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నారని చార్జెడ్ అకౌంటెంట్, కాంగ్రెస్ నేత వేణుగోపాల స్వామి ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకోవాలని, మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఓటర్లను ప్రోత్సహిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏ పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా సరే, ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాలని ఓటర్లకు కేటీఆర్ సూచిస్తున్నారని వెల్లడించారు. ఈ ఫిర్యాదు పరిశీలించి, మూడు రోజుల్లోగా మూడు రోజుల్లోగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదు లేఖలో ఈసీని వేణుగోపాల స్వామి కోరారు. 3 రోజుల్లో చర్యలు తీసుకోని పక్షంలో తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని లేఖలో ఆయన స్పష్టం చేశారు.
మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ప్రజాస్వామ్యాన్న అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. డబ్బులు వేరే పార్టీల వద్ద తీసుకుని, ఓట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేయాలని ఓటర్లను ప్రోత్సహిస్తున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటీవల జరిగిన సభలలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓట్లు మాత్రం తమకు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడితే, రాష్ట్రంలో అభివృద్ధి మరో స్థాయికి వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు పంచాలని, ప్రజలు పైసలు తీసుకుని ఓట్లు వేయాలని చెప్పడం ప్రలోభాలకు గురిచేయడమేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.