Indian President Droupadi Murmu: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమమేధను మరింత ఉపయోగించుకుని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి  ద్రౌపదిముర్ము అన్నారు. ధనికులతో పోలిస్తే పేదలు న్యాయం పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని ఆమె సూచించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి ఆదర్శంగా నిలిచారని ఆమె గుర్తు చేశారు. నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదగొచ్చని తెలిపారు.  .


విద్యార్థులకు బంగారు పథకాలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పర్యటన నిమిత్తం శనివారం ఢిల్లీ నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ (Begumpet Airport)కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy), మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, సీఎస్, నగర మేయర్,  పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.  ఈ పర్యటనలో భాగంగా ఆమె మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పి.ఎస్‌ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, వైస్‌ ఛాన్స్‌లర్‌ శ్రీకృష్ణదేవ రావు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ ఆలోక్‌ అరాధే రాష్ట్రపతికి జ్ఞాపికను బహుకరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 


ఆనాడే చాణక్యుడు చెప్పాడు
రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ..  చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే ఆయన మంత్రి చాణక్యుడు తన ప్రసిద్ధ గ్రంథం ఆర్థశాస్త్రంలో ప్రతి 10 గ్రామాలకు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఉండాలని సూచించారని, అర్థశాస్త్రంలో సామాజిక న్యాయం గురించి ఎన్నో అంశాలు ప్రస్తావించారని ఆమె అన్నారు. కేసులు పరిష్కారం అయ్యే వరకు జడ్జీలు, పిటిషనర్ల మధ్య ఎలాంటి ప్రైవేట్ సంభాషణలు ఉండకూడదన్నారు. మన దేశంలో న్యాయ సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, న్యాయం కోసం మహాత్ముడు పోరాడారన్నారు. పేద రైతులకు ఇండిగో వ్యాపారుల నుంచి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతితరేకిస్తూ చంపారన్ ఉద్యమాన్ని చేపట్టారని రాష్ట్రపతి గుర్తు చేశారు. నల్సార్ విశ్వవిద్యాలయం కృత్రిమ మేధ (ఎఐ)ను ఒక అధ్యయనాంశంగా గుర్తించి, ఈ రంగంపై దృష్టి సారించడం పట్ల ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ జంతు న్యాయ కేంద్రం ఏర్పాటు తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. ఇరవైఏళ్ల కింద తాను ఒడిషా మత్స్య-జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు


భారతీయ కళా మహోత్సవ్ 2024 ప్రారంభం
సికింద్రాబాద్‌లోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్-2024( Bharatiya Kala Mahotsav 2024) కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు జరగనున్న ఈ భారతీయ కళా మహోత్సవాలు జరుగనున్నాయి.. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు పది మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి సమక్షంలో కళాకారులు నృత్యాలు, కళారూపాలను ప్రదర్శించారు. ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో 400 మంది హస్తకళల కళాకారులు, 300 మంది చేనేత కుటుంబాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి సేంద్రీయ ఆహార ఉత్పత్తులను విక్రయించారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిందా, త్రిపుర వంటి 8 రాష్ట్రాల నుండి హస్తకళలు, హస్తకళలు, చేనేత కుటుంబాలు,  యువకులు పాల్గొని తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. 


Also Read: Hydra Ranganath: హైడ్రా సైలెంట్‌గా లేదు- మల్లారెడ్డి, ఒవైసీల కాలేజీలు కూల్చివేతపై రంగనాథ్ క్లారిటీ