HYDRA commissioner Ranganath | హైదరాబాద్: హైడ్రా అంటే భూతం కాదని, ఓ బాధ్యత అని ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అయితే నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలా పరిరక్షణతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ హైడ్రా బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ సచివాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతాల వారికి నోటీసులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలపై మీడియాతో మాట్లాడారు.


హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఏ భవనానికి సైతం జీహెచ్ఎంసీ సహా సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్లు లేవని రంగనాథ్ స్పష్టం చేశారు. 2 నెలల నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని, నిబంధనల ప్రకారం వెళ్తున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో హైదరబాద్ వాసులే బాధితులు అవుతారని చెప్పారు.


ఆ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు.. అయినా భారీ నిర్మాణాలు 
అమీన్ పూర్ ఏరియాలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో విల్లాలు అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయడంపై రంగనాథ్ కీలక విషయాలు వెల్లడించారు. అమీన్ పూర్ విల్లాలకు ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ నిర్మాణాలకు పర్మిషన్ ఎప్పుడో రద్దు చేశారు. అవి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కారణంగా గత ప్రభుత్వంలోనూ వాటికి పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. అవి మొత్తం కొనేది ఓ వ్యక్తి ఉంటాడు, పర్మిషన్ లేదని చెప్పినా వాళ్లు మేనేజ్ చేసి అనుమతులు ఉన్నట్లు చూపిస్తాడు. ఆ ల్యాండ్ అమ్మి, అక్కడ విల్లాలు నిర్మించారు. నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను, పర్మిషన్ లేకున్నా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నాం. ఇప్పుడు కూల్చివేతలతో ఇక్కడితోనే పోతుంది. లేకపోతే భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా, వరదలు వస్తే భారీ స్థాయిలో నష్టం కలుగుతుందన్నారు. తప్పుడు పత్రాలతో వాటిని విక్రయించి ఎంతో మంది జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టిన వారే అసలైన దోషులని స్పష్టం చేశారు.


 



మేం సైలెంట్‌గా లేం.. పెద్ద తిమింగళాలే మా టార్గెట్..


మేం సైలెంట్ గా ఉన్నామని, పెద్దల జోలికి వెళ్లడం జోలికి వెళ్లడం లేదని మీకనిపిస్తోంది. కానీ దీనిమీద బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. పెద్దలే టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు త్వరలో జరగనున్నాయి. అది చూసి మీరే ఆశ్చర్యపోతారని.. ఒవైసీ బ్రదర్స్ కు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం లేదన్న ఆరోపణలపై ఈ విధంగా స్పందించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలో పర్మిషన్ ఇచ్చారన్నది నిజం కాదు. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఇచ్చినట్లు తేలితే అధికారులను అరెస్ట్ చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ సెక్రటరీని అరెస్ట్ చేశాం. బిల్డర్ పై కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు. అనుమతి తీసుకునేది ఓ చోట అయితే నిర్మాణాలు చేపట్టేది మరోచోట అని స్పష్టం చేశారు. అందువల్లే ఈ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోందని క్లారిటీ ఇచ్చారు. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు ఆపాలని అధికారుల నుంచి నోటీసులు వచ్చినా, కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో రిజల్ట్ తేలకున్నా నిర్మించడంతో కొందరు నష్టపోతున్నారని వెల్లడించారు.


హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!


కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాదవ బస్తీలో గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డలకు ఇచ్చిన ఇండ్లను హైడ్రా కూల్చివేస్తుందన్న భయంతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం దుమారం రేపుతోంది. గుర్రంపల్లి శివయ్య బుచ్చమ్మ దంపతులకు సంతానం ముగ్గురు కూతుర్లు కాగా, అందిరికి వెళ్లిళ్లు చేసింది. వారికి కట్నంగా ఇండ్లు ఇచ్చారు శివయ్య. అయితే హైడ్రా కూల్చివేతలలో భాగంగా ఆ ఇండ్లు ఖాళీ చేయాయని అధికారులు నోటీసులు ఇచ్చారు. బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయన్న భయంతో తల్లి బుచ్చమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాజకీయంగా దుమారం రేపుతోంది.