హైదరాబాద్: న్యాయం చేస్తారని నమ్మి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళని లొంగదీసుకున్నాడు ఓ సీఐ. ఆపై ఆమెతో లైంగిక అవసరాలు తీర్చుకుని, వీడియోలు తీసి వేధిస్తున్నట్లుగా తేలడంతో పోలీస్ శాఖ ఆ సీఐపై వేటు వేసింది. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజుతున్నట్లు గుర్తించిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనర్ సస్పెన్షన్ వేటు వేశారు. విధి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడంతో పాటు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన కేవలం 4 నెలల్లోనే ఆయన సస్పెండ్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో రిలేషన్, లైంగిక దాడి
తనకున్న సమస్యపై పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితురాలికి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తన మొబైల్‌లో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని, ఆపై అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి నుంచి వచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులు రెడ్డిపై శాఖా పరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను శ్రీనివాసులురెడ్డి ఖండించారు. బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళే తనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసిందని ఆయన ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం కమిషనర్ సజ్జనార్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.
