IPS Officer Controversies: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారితో అనుచితంగా ప్రవర్తించిన కేసులో పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణకు సహకరించకుండా, సెక్షన్ 35(3) BNSS కింద జారీ చేసిన చట్టబద్ధమైన నోటీసులను కూడా తీసుకోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనను నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ప్రత్యేక పోలీస్ బృందాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.
తోటి మహిళా ఐపీఎస్‌ను వేధించినట్లుగా కేసు నమోదు
రాజేంద్రనగర్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్ కృష్ణారెడ్డి తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జూన్ 23 నుంచి తనకు అసభ్యకర మెసేజ్‌లు పంపాడని పేర్కొన్నారు. ఆపై జూలై 8న గదిలోకి లాకెళ్లి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని బెదిరించాడని.. జూలై 9న గదిలో బంధించి, జుట్టు పట్టుకుని దాడి చేసి, మెడపై కత్తి పెట్టి బెదిరించాడని ఆరోపించారు. జూలై 10న తన ప్రైవేట్ వీడియోలు తీసి, వాటిని తన భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అత్తాపూర్ స్టేషన్‌లో కేసు నమోదు - సస్పెండ్ చేసి అకాడెమీ నుంచి పంపేసిన అధికారులు
బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఐటీ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేశారు. నిందితుడు గతంలోనూ సహచర ఐపీఎస్‌లతో అమర్యాదగా ప్రవర్తించేవాడని, వాట్సప్ గ్రూపుల ద్వారా కొందరిని వేధించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డిని నేషనల్ పోలీస్ అకాడమీ అధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేసి అకాడమీ నుండి పంపించివేశారు. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ప్రివిలేజ్ కమిటీ.. సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి విచారించిన అనంతరం ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించి ఈ తక్షణ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది.
ఆత్మహత్యాయత్నం, సూసైడ్ నోట్ పేరుతో డ్రామాతో మరిన్ని చిక్కులు
తర్వాత ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా డ్రామా ఆడారు. అధికంగా మద్యం సేవించి స్పృహతప్పిపడిపోయారు. సూసైడ్ నోట్ రాసినట్లుగా ఓ రెండు పేజీలు రాసి.. ఆమెతో వివాహేతర బంధం ఉందన్నట్లుగా ప్రచారం చేశారు. ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత కనిపించకుండా పోయారు. రెండు రోజుల పాటు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. అయితే ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
