Jubilee Hills By Election Notification | హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది.  నేటి నుండి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలుకానుండగా.. అక్టోబర్ 21 వరకు షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు  24 వరకు ఉంది. నవంబర్‌ 11న ఎన్నికలు నిర్వహించనుండగా, 14 కౌంటింగ్‌ చేసి, విజేతను ప్రకటిస్తారు. 

Continues below advertisement

అభ్యర్థులకు మార్గదర్శకాలు..సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు ఆఫ్ లైన్ తో పాటు ఆన్‌లైన్ విధానంలోనూ దాఖలు చేయడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు.  కార్యాలయంలో నేరుగా లేదా.. డిజిటల్‌ విధానంలో దాఖలు చేసే అవకాశం కల్పించారు. 25 ఏళ్లు నిండిన పౌరులు ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేయవచ్చు. రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీగా గుర్తింపు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన ఒక పౌరుడు ప్రతిపాదన చేస్తే సరిపోతుంది. స్వతంత్రులు, ఇతర అభ్యర్థులు అయితే పది మంది వారిని ప్రతిపాదించాలని ఈసీ పేర్కొంది.

Continues below advertisement

నామినేషన్ ఫారం 2బీతో పాటు ఎన్నికల అఫిడవిట్ ఫారం 26ను అభ్యర్థులు సమర్పించాలి. అభ్యర్థులు నేరుగా గానీ, లేక వారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో ఎవరైనా ఒకరు షేక్‌పేట్ ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. ఎవరైనా ఆన్‌లైన్ లో నామినేషన్ వేయాలంటే డిజిటల్‌ నామినేషన్‌ను అధికారి వెబ్  సైట్ https://encore.eci.gov.in ద్వారా దాఖలు చేయాలి. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న ప్రింటెడ్‌ హార్డు కాపీని సంబంధిత ఎన్నికల అధికారులకు అందజేయాలి. నామినేషన్ వేసే అభ్యర్థులు మరికొన్ని సెట్ల పత్రాలు సైతం ముందు జాగ్రత్తగా సమర్పిస్తుంటారు.

అదే నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలా..?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 173(బీ) ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థులకు 25 ఏళ్లు నిండాలి. రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో ఓటరుగా ఓటు హక్కు ఉండాలి. రాష్ట్రంలోని వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తనకు ఓటు హక్కు ఉన్నట్లు సర్టిఫికెట్ సమర్పించాలి. ఒకవేళ అది రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయితే అభ్యర్థి సంబంధిత సామాజికవర్గానికి చెందిన వారని కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు పోటీ చేయొచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 4, 5 ప్రకారం అలా పోటీ చేయడానికి అర్హులు అవుతారు.

అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు

కాంగ్రెస్ పార్టీ ఇదివరకే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న నవీన్ యాదవ్‌కు అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఉప ఎన్నికల్లో తమదే విజయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తున్నారు. ఇటీవల కన్నుమూసిన మాగంటి గోపీనాథ్ కుటుంబానికే బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. మరోవైపు బీజేపీ మాత్రం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.