KTR Praises Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీరును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశంసించారు. నేడు తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘‘ఈరోజు హరీష్ గారు నేటి అసెంబ్లీలో అద్భుత ప్రదర్శన చేస్తూ మాట్లాడారు. కృష్ణా జలాలు/కేఆర్‌ఎంబీకి సంబంధించి కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారాలు & అబద్ధాలన్నింటినీ ఆయన దీటుగా ఎదుర్కొన్నారు. రేపటి ఛలో నల్గొండకు సరైన సందర్భాన్ని సెట్ చేశారు. రేపు నల్గొండలో కేసీఆర్ తన అసమానమైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న అబద్ధాలు, దుష్ప్రచారాలకు తూట్లు పొడవబోతున్నారు’’ అని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అదే సమయంలో నేడు (ఫిబ్రవరి 12) మధ్యాహ్నం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ మాట్లాడారని అన్నారు. ఆయన మాట్లాడేది తమకే అర్థం కావడం లేదని.. ఇక తెలంగాణ ప్రజలకు ఏం అర్ధం అవుతుందని ఆయన ప్రశ్నించారు.