KCR supports for Rayalaseema Lift Irrigation: హైదరాబాద్: తెలంగాణ నీటి పంపకాలపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధంలా మారింది. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నాశనం చేసిందని తెలంగాణ ప్రయోజనాలను కాలరాసిందని అధికార కాంగ్రెస్ సభ్యులు బలంగా వాదించారు. కృష్ణా ప్రాజెక్టులను KRMB కి అప్పగించకూడదనే తీర్మానంపై మొదలైన చర్చ.. మరో మలుపు తిరిగింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏపీతో పూర్తిగా రాజీపడిపోయిందని తెలంగాణ మంత్రులు విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి కేసీఆర్ కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
రాయలసీమ ప్రాజెక్టు టెండర్లకు సహకరించిన కేసీఆర్
అసెంబ్లీలో సోమవారం (ఫిబ్రవరి 12న) ఉదయం నుంచి తీర్మానంపై జరుగుతున్న చర్చ.. రాయలసీమ ఎత్తిపోతలపైకి వెళ్లింది. కిందటి ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దేందుకే తీర్మానం అంటూ.. పదేళ్లలో ఏం జరిగిందో నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిని సరిచేయడానికి తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరారు. దీనిపై మాజీ నీటి పారుదల మంత్రి హరీష్‌రావు సమాధానం ఇస్తుండగా ఉత్తమ్‌తో పాటు... మంత్రులు పొన్నం, సుధీర్‌బాబు, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మాట్లాడారు. అయితే చర్చ జరుగుతున్న క్రమంలో రాయలసీమ ఎత్తిపోతల పాపం పూర్తిగా కేసీఆర్‌దే అని ఉత్తమ్ కుమార్ అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు రేయింబవళ్లు జరుగుతున్నా అప్పటి తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు ఖరారవుతున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోగా.. కావాలనే టెండర్లకు సహకరించిందన్నారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే అప్పటి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు సహకరించిందని ఆరోపించారు.
అభ్యంతరం చెప్పాల్సి ఉంటుందని కేసీఆర్ హాజరు కాలేదా!
రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రులతో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలనుకుందని.. దీనికి హాజరైతే ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈ మీటింగ్‌కు హాజరుకాలేదన్నారు. ఆగస్టు 10, 2020 న ప్రాజెక్టుకు టెండర్లు ఫైనలైజ్ అయ్యాయని.. అంతకంటే ముందే అపెక్స్ కమిటీ సమావేశం జరగాల్సి ఉన్నా.. కేసీఆర్ గైర్హాజరీ వల్ల అది జరగలేదని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేందుకు జగన్ మోహనరెడ్డికి సహకరించారన్నారు. “తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున సమావేశాన్ని 20వ తేదీ జరపాలని” కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని.. ఇదంతా ఏపీ ప్రభుత్వంతో ముందస్తు ఒప్పందంలో భాగమేనని ఆరోపించారు.
ప్రభుత్వం ఆరోపణలు ఖండించిన హరీష్
మంత్రుల ముప్పేట దాడిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఎదుర్కొన్నారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రులు ఆరోపణలు సంధిస్తున్నా ఆయనొక్కరే సమాధానం ఇచ్చారు. పోతిరెడ్డిపాడు కాలువ వెడల్పు చేస్తున్నప్పుడు.. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లంతా అసెంబ్లీలోనే ఉన్నారని.. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసి ప్రాజెక్టుపై స్టే తీసుకొచ్చామని వాదించారు.