Hyderabad major biryani chains IT sleuths raid: నగరంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మూడు బిర్యానీ రెస్టారెంట్ లపై ఆదాయపు పన్ను దర్యాప్తు విభాగం మంగళవారం ఉదయం నుంచి విస్తృత సోదాలు చేపట్టింది. పిస్టా హౌస్, షా గౌస్, మెహ్ఫిల్ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌లకు చెందిన కార్యాలయాలు, బ్రాంచ్‌లు, యజమానుల నివాసాలతో సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి.
అనేక కోట్ల రూపాయల విలువైన అమ్మకాలను దాచిపెట్టి పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ప్రాథమిక సమాచారం లభించడంతో ఈ సోదాలు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ఆర్డర్లు, ఫ్రాంచైజీ వ్యాపారం, హలీమ్ సీజన్‌లో భారీ టర్నోవర్‌లను సరిగ్గా రికార్డు చేయకపోవడం, నగదు లావాదేవీలను దాచిపెట్టడం వంటి అంశాలపైనే దర్యాప్తు కేంద్రీకరించారు. పిస్టా హౌస్ షా అలీ బండాలోని ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన సోదాలు రంగారెడ్డి జిల్లాలోని బ్రాంచ్‌ల్లోనూ నిర్వహిస్తున్నారు. 1997లో మొహమ్మద్ అబ్దుల్ మజీద్ స్థాపించిన ఈ బ్రాండ్ ఇప్పుడు భారత్‌తో పాటు అమెరికా, దుబాయ్, ఒమన్, కువైట్‌లలో మొత్తం 44 ఔట్‌లెట్లను నడుపుతోంది. సల్మాన్ ఖాన్ నుంచి రాజకీయ నాయకుల వరకు సెలబ్రిటీలకు పిస్తాహౌస్ బిర్యానీ ఇష్టం. గత కొన్నేళ్లుగా రంజాన్ హలీమ్ సీజన్‌లోనే అనేక కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుందని అంచనా.
అలాగే గచ్చిబౌలి నుంచి ఓల్డ్ సిటీ వరకు విస్తరించి ఉన్న షా గౌస్ బ్రాంచ్‌లు, కార్యాలయాలు, యాప్‌లతో జరిపే వ్యాపారంపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టారు. 2006లో ప్రారంభమైన మెహ్ఫిల్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్‌లో 15 బ్రాంచ్‌లతో పాటు దుబాయ్‌లోనూ ఔట్‌లెట్‌ను నడుపుతోంది. 2025లోనూ కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించారు. ఈ మూడు బిర్యానీ కింగ్ ల యజమానులు పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మూడు గొలుసుల యజమానులు, ఆర్థిక నిర్వాహకుల నివాసాల్లోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతుండటంతో నగర వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. సోదాలు పూర్తయ్యాక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ మూడు సంస్థల బిజినెస్ మోడల్ వేరుగా ఉంటుంది. ఎక్కువగా నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తారు. నగదుతో చెల్లిస్తే ఓ ధర ఉంటుంది.. ఆన్ లైన్ పేమెంట్ అయితే మరో ధర ఉంటుంది. మెహఫిల్ రెస్టారెంట్లలో అయితే చాలా చోట్ల నగదు లావాదేవీలు మాత్రమే జరుగుతాయి. అయితే వీరి వ్యాపారం మాత్రం ఊహించనంత బిజీగా ఉంటుంది. ఎప్పుడు చూసినా సీట్లు ఖాళీ ఉండవు. రంజాన్ మాసంలో అయితే వీరి హోటళ్ల వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. ఎక్కువ ధర పెట్టినా హలీంను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేస్తున్నా వీరు చాలా స్వల్పమొత్తంలోనే పన్నులు చెల్లిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో సోదాలు చేస్తున్నారు. ఎంత మేర పన్ను ఎగవేతలు బయటపడతాయో చూడాల్సి ఉంది.