DCP Phone Hack: టెక్నాలజీ అరచేతిలోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అదే సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్లు హ్యాక్ చేసి అందులోని సున్నితమైన సమచారాన్ని తస్కరిస్తున్నారు. వీటి మీద దృష్టి సారించడానికి పోలీసులు సైతం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫోన్లలో గుర్తు తెలియని యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవద్దని, గిప్ట్ కార్డులు, బహుమతులు అంటూ వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. అయితే అలాంటి వారి ఫోన్ హ్యాక్ అయితే, అందులోని సీక్రెట్ మెస్సేజ్‌లు వీడియోలు చోరీ చేసి వారికి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
 
సరిగ్గా ఇలాంటి ఘటనే సైబరాబాద్ పరిధిలో జరిగింది. తెలంగాణలో ఎన్నికలు కావడంతో పోలీసు యంత్రాంగం నిత్యం తనిఖీలు, బందోబస్తు విధుల్లో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ సమయంలో సైబరాబాద్‌ పరిధిలోని ఒక డీసీపీ ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. శనివారం ఉదయం నుంచి విధి నిర్వహణలో నిమగ్నమైన ఓ డీసీపీ ఫోన్‌ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా హ్యాకింగ్‌కు గురైనట్టు గుర్తించారు. దాదాపు 2 గంటల సమయం ఫోన్‌ పూర్తిగా అవతలి వారి చేతిలోకి చేరినట్టు నిర్ధారించారు. ఇదంతా ఓ ఐటీ ఉద్యోగి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో సమాచారాన్ని తస్కరించి పోలీసులకు వార్నింగ్ పంపినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


సదరు అధికారి ఓ మహిళతో అసభ్యకరంగా చేసిన చాట్, అంతే కాకుండా ఎవరెవరితో చాట్ చేశారో వారి లిస్ట్ బయటకు తీసి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు కావాలని ఓవరాక్షన్ చేస్తున్నారని, రానున్న రోజుల్లో పోలీసులపై ప్రతి ఒక్కరి డేటాను బయటపెడతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, పోలీసు వ్యవస్థ శాశ్వతమని, అలాంటి పోలీసు వ్యవస్థ రాజకీయ నేతలలో కనుసందాలలో నడుస్తున్నట్లు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 


రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగులపై కేసు నమోదు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల చేతిలో వేధింపులకు గురయ్యే ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ నెంబర్ ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటామని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీ ఉద్యోగులపై ఏ రాజకీయ పార్టీ, ఏ పోలీస్ అధికారైన చేయి చేసుకున్నా, వారి జోలికి వెళ్లినా అలాంటి వారిపై ఖచ్చితంగా దృష్టి పెడతామంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొందరి పోలీసుల సమాచారం కూడా ఇదే విధంగా వెలికితీస్తామంటూ తమ పోస్టు ద్వారా హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది.


డీసీపీ ఫోన్ హ్యాక్ అవడంతో సైబర్‌ నిపుణులు రంగంలోకి దిగారు. గంటల కొద్ది శ్రమించి డీసీపీ ఫోన్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చినట్లు సమాచారం. ఇది హ్యాకర్ల పనా? ఎవరైనా గిట్టని వారు చేశారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి ఫోన్‌ హ్యాక్‌ చేయడాన్ని పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నగరంలో ఒక ఐటీ ఉద్యోగిపై సదరు డీసీపీ చేయిచేసుకోవటం వల్లనే ఐటీ నిపుణులు ఫోన్‌హ్యాక్‌ చేశారని, దానిలోని వ్యక్తిగత వీడియోలు బయటపెట్టినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.