కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 18 నుంచి పార్టీ నేతలు బస్సుయాత్ర చేస్తున్నారు. తొలిరోజు బస్సుయాత్రలో పార్టీ నేతలతో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారు. ములుగు జిల్లాలో 18న యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు రామప్ప టెంపుల్‌ను రాహుల్ సందర్శిస్తారు. రాత్రి భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేయనున్నారు. 19న రామగుండంలో సింగరేణి కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. రామగుండం నుంచి పెద్దపల్లి వరకు రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేయనున్నారు. పెద్దపల్లిలో జరిగే బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. రాత్రికి కరీంనగర్‌లో కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు. 20న బోధన్‌లో బీడీ కార్మీకులు గల్ఫ్ బాధిత కుటుంబాలతో రాహుల్ సమావేశం కానున్నారు. బోధన్ నుంచి ఆర్మూర్‌కు బస్సులో ప్రయాణం చేయనున్నారు. ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాత్రి 7 గంటలకు నిజామాబాద్‌లో రాహుల్‌గాంధీ పాదయాత్ర చేస్తారు.
55 మందితో తొలి జాబితా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మొత్తం 55 మంది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్ కేటాయించారు. వామపక్షాలు భద్రాచలం టికెట్‌ను డిమాండ్ చేసినప్పటికీ, సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు కూడా జాబితాలో లేదు. వీరందరి పేర్లు బుదవారం లేదా గురువారం గురువారం విడుదల చేసే రెండో జాబితాలో ప్రకటించే ఛాన్స్ ఉంది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.