BRS vs Congress | తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్ లో సైతం నూతనోత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాదే అగ్రభాగం అంటూ రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్, గత ఎన్నికల్లో ఓటమి తరువాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంది. 


బీఆర్ఎస్ ఖాళీ అని ఓపెన్ ఛాలెంజ్


సీఎంగా రేవంత్ అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్, టార్గెట్ కేటీఆర్ గా ముందుకు వెళ్లింది. కర్త, కర్మ, క్రియ ఆయనే అంటూ విమర్శలతో బీఆర్ఎస్ పార్టీని ఉక్కిబిక్కిరి చేశారు. ఇంక పార్టీ ఖేల్ ఖతం అనేంతలా పరిస్థితులు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కేడర్ సైతం నైరాశ్యంలోకి వెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారం చేపట్టిన వెంటనే కాంగ్రెస్ దూకుడుకు బీఆర్ఎస్ బ్యాటరీ చార్జీంగ్ పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి. కీలక నేతలు సైతం బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. గేట్లు తెరిస్తే మొత్తం పార్టీ ఖాళీ అవుతుంది అంటూ కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరేంతలా క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంది గులాబీ దళం.


మైనస్ అయిన హైడ్రా ప్లాన్


ఆ తరువాత రాష్ట్రంలో పరిస్థితులు నెమ్మదిగా మారుతూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని బీఆర్ఎస్ కు కలిసొచ్చాయి. అందులో ముందుగా హైడ్రా (HYDRA) ఏర్పాటు, నిర్మాణాల కూల్చివేతలు. చెరువుల రక్షణ పేరుతో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ వందల నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. పలు ప్రాంతాల్లో గుడిసెల నుంచి విల్లాల వరకూ బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. బాధితులకు అండగా బీఆర్ఎస్ గొంతెత్తింది. హైడ్రా బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి మద్దతుగా పోరాటాలకు సిద్ధమైంది. ప్రభుత్వం అభాసుపాలైయ్యేలా ఉందని భావించిన సర్కారు హైడ్రా స్పీడ్ కు మధ్యలో బ్రేక్ వేసింది. బీఆర్ఎస్ వల్లే హైడ్రా ఆగిందని బీఆర్ఎస్ నేతలు తమకు అవకాశంగా మార్చుకున్నారు.


మూసీ పునరుజ్జీవం (Musi Development Project) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మరో  నిర్ణయం సైతం బీఆర్ఎస్ కు కలిసొచ్చింది. మూసీ పరిధిలో ఆక్రమణలు తొలగించి, మూసీని సుందరంగా, విదేశాలలోని పర్యాటక ప్రాంతాల తరహాలో మార్చేస్తామంటూ రేవంత్ ప్రకటన చేసి యాక్షన్ లోకి దిగారు. అదే సమయంలో మూసీ బాధితులకు బీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. ముందు పునరావాసం కల్పించి, ఆ తరువాతే ఆక్రమణలు తొలిగించాలని డిమాండ్ చేసి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసి, బిజెపితో గొంతు కలపి మూసీలో సర్కార్ దూకుడుకు తాత్కాలికంగా బ్రేకులు వేయగలిగింది. 


Also Read: Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు


లగచర్లలో వెనక్కి తగ్గిన సర్కార్!


సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పరిధిలోని లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ ప్రమేయం ఉందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ చివరకు ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంలో బీఆర్ఎస్ పాత్ర కీలకమని చెప్పవచ్చు. తమ పార్టీ నేతలపై ఆరోపణలు, కేసులు నడుస్తున్నా, బాధితులను సంఘటితం చేయడం, ఢిల్లీ వరకూ వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో బీఆర్ఎస్ వ్యూహం సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.



తెలంగాణలో అనేక సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులు తినే ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజన్ కావడం... ఇటీవల ఓ విద్యార్థిని మృతి చెందటం, దీనికి తోడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంపూర్తిగా రైతు రుణమాఫీ ఆరోపణలు, రైతు భరోసా అందరికీ అందలేదనే విమర్శలు, 6 గ్యారెంటీలు ఇంకెప్పుడు అనే డిమాండ్ లు ఇలా.. ఒకటేమిటి బీఆర్ఎస్ కు పెద్దగా రిస్క్ చేయకుండానే వరుస ప్రజా సమస్యలు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు గులాబీ పార్టీని రీఛార్జ్ చేస్తున్నాయి. బ్యాటరీ డెడ్ అయ్యే స్థితి నుండి కాంగ్రెస్ ఇచ్చిన ఫుల్ ఛార్జ్ తో జోష్ మీద బీఆర్ఎస్ నేతలు ఉన్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.