SRH vs CSK IPL 2024 Ticket Booking Online: హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో కొందరు ఆన్ లైన్‌లో కనిపించిన లింక్స్ క్లిక్ చేసి టికెట్ బుకింగ్ చేసుకుని సైబర్ నేరగాళ్ల చేతిలో బుక్ అయిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు, సైబర్ విభాగం సిబ్బంది నగర ప్రజలను అప్రమత్తం చేసింది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కొన్ని రోజుల కిందటే సీఎస్కే, హైదరాబాద్ (CSK vs SRH) మ్యాచ్ కి టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయినా, టికెట్ల కోసం త్వరపడండి అంటూ సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. 


మ్యాచ్ టికెట్లు ఆల్రెడీ క్లోజ్.. 
ఉప్పల్ వేదికగా శుక్రవారం (ఏప్రిల్ 5న) చెన్నై, హైదరాబాద్ తలపడనున్నాయి. ఆన్ లైన్ లో టికెట్స్ అన్ని క్లోస్ అవ్వడంతో కొన్ని రోజుల కిందటే టికెట్ విక్రయాలు నిలిపివేసింది పేటీఎం, ఇతర వెబ్ సైట్స్. కానీ హైదరాబాద్, చెన్నై మ్యాచ్ కు మీకు టికెట్లు ఇప్పిస్తామని కొందరు ఫేక్ లింకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టికెట్లు కావాలంటే లింక్ క్లిక్ చేసి బుకింగ్ చేసుకోవాలని ఆన్ లైన్ లింక్స్ పోస్ట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఐపీఎల్ మ్యాచ్ చూసే ఛాన్స్ ఇంకా ఉందంటూ.. కొందరైతే క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. భారీ డిస్కౌంట్ అని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతన్నారు. ఎక్కువ డబ్బులు అయినా సరే మ్యాచ్ టికెట్లు దొరికితే చాలంటూ క్రికెట్ ప్రేమికులు ఆ లింక్స్ క్లిక్ చేసి ఓటీపీలు చెప్పి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకుని లబోదిబో మంటున్నారు. 


IPL మ్యాచ్‌ టికెట్ల పేరుతో ఇన్‌స్టా రీల్స్‌, స్టోరీలు - బుకింగ్ చేస్తే బుక్ అవుతారు
క్రికెట్‌ అభిమానులకు హెచ్చరిక!! ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ IPL మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇన్‌స్టా రీల్స్‌, స్టోరీలు, యూట్యూబ్‌ షార్ట్స్‌ లో ఫేక్‌ లింక్‌లను పోస్టు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని ఐపీఎస్, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. ఎలాగైనా స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే అభిమానులను టార్గెట్‌ చేస్తూ, లక్షల్లో దండుకుంటూ వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. కొందరు సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి పోస్టుల పట్ల క్రికెట్‌ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ లింక్‌లపై అసలే క్లిక్‌ చేయొద్దు. క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు గుల్లవుతుంది.. జాగ్రత్త! అని పోస్ట్ చేశారు.