BJP MP Laxman Comments On Revanth And Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే మంచిదని సూచిస్తోంది. 


నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్‌..." ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లోనే కాకుండా అంతకు ముందు జరిగిన ఉపఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నింటిపై సమగ్ర దర్యాప్తు చేయకుండా కావాల్సిన వాళ్లను తప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల అందరిపై ఒకే విధంగా దృష్టి పెట్టడం లేదు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని మేం కోరుతున్నాం.  


టామ్‌ అండ్‌ జెర్రీ మాదిరిగా కొట్టకుంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. రేవంత్‌ రెడ్డికి ఈ కేసుపై చిత్త శుద్ధి ఉంటే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ చాలా ఆరోపణలు చేసిందని దేనిపై కూడా ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కోసం ఇరుపార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.