అజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం పురస్కరించుకొని 25 రోజుల పాటు యోగా ఉత్సవ్ కార్యక్రమాన్న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్భనంద్ సోనోవల్, ఎమ్మెల్యే రాజసింగ్, క్రికెటర్ మిథాలీ రాజ్, సినిమా స్టార్ట్స్ మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్... నిత్యం యంగ్‌గా ఉండాలంటే యోగా చేయాలని సూచించారు. యోగాతో ఎన్నో లాభాలు ఉన్నాయని... ఫిట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. హైపర్ టెన్షన్ వంటివి దూరం అవుతాయని తెలిపారు. జూన్ 21 న యోగా డే ను జరుపుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు యేడాది మొత్తం మీద ఎక్కువ పగలు ఉండే రోజన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190పైగా దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారని తమిళిసై గుర్తు చేశారు. ఇందులో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయన్నారు. దేశంలొ ఉన్నా ప్రతి ఒక్క పౌరుడు యోగా చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
2014 డిసెంబర్ ఐక్యరాజ్యసమితి జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా గుర్తించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా యోగా డేస్ జరుపుకుంటున్నామన్నారు. 25 రోజుల యోగా కౌంట్ డౌన్ పండుగ ఇక్కడ జరగడం ఆనందంగా ఉందన్నారు. జూన్ 21న పెద్ద ఎత్తున యోగా డే ను ట్యాంక్ బండ్ మీద అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహిస్తామన్నారు. యోగాతో జీవితంలో క్రమశిక్షణ వస్తుందన్నారు కిషన్ రెడ్డి.
ప్రధానమంత్రి మోదీ చొరవతో యోగా ప్రపంచవ్యాప్తమైందన్నారు కేంద్ర మంత్రి సర్భనంద సోనోవల్. యోగాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 21 జూన్ కేవలం ఇండియాలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యోగా నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణలో జూన్ 21 న పెద్ద ఎత్తున హాజరై యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేశారాయన.