Karimnagar News : నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న ఓ గ్యాంగ్ నకిలీ ఆఫర్ లెటర్స్ ఇస్తూ మోసాలకు పాల్పడుతోంది. ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఆఫర్ లెటర్స్ ఇచ్చి నిరుద్యోగులను డబ్బులు వసూలు చేస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కర్ణమామిడి గ్రామానికి చెందిన బొడ్డు రజితను, తిరుపతి, అతని స్నేహితుడైన సతీష్ తన ఇంటికి వచ్చి హైదరాబాద్ లో సుచిత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా కస్తూర్బా స్కూల్ లో కిచెన్ గార్డెన్, ఇంఛార్జ్ ఉద్యోగం ఇస్తామని ప్రతి నెల 12 వేల రూపాయల జీతం వస్తుందని చెప్పారు. ఆ జీతాన్ని సుచిత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ల ద్వారా ఇప్పిస్తానని నమ్మించారు. అందుకు రూ.1,70,000 అవుతుందన్నారు. ఒకవేళ ఉద్యోగం రానట్లయితే తన డబ్బులు రిటర్న్ చేస్తామని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన రజిత వాళ్లకు ముందుగా రూ. 80 వేలు ఇచ్చింది. దీంతో ఆమెకు లక్షేట్టిపేటలోని కస్తూర్బా స్కూల్ లో కిచెన్ గార్డెన్ ఇన్చార్జిగా జాబ్ వచ్చినట్టు సుజాత ఠాకూర్ పేరుతో ఓ నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆమె దగ్గర నుంచి మిగత రూ. 90 వేలు వసూలు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు తిరుపతి, సతీశ్. 


పోలీసులకు ఫిర్యాదు 


ఆ స్కూల్లో రెండు నెలలు పనిచేసిన రజితకు జీతం రాలేదు. అయితే ఆమె తిరుపతి, సతీశ్ లు జీతం గురించి అడగగా వెళ్లి సుజాత ఠాకూర్ నే అడుగూ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పగా మోసపోయానని గ్రహించింది. ఆ స్కూల్ లో ఉద్యోగం మానేసి, తాను ఇచ్చిన రూ.1,70,000 తిరిగి ఇవ్వమని అడగగా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తామంటూ తిరుపతి, సతీశ్ తిప్పుకోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


మరో వ్యక్తిని మోసం


దొనబండకు చెందిన బైరి రవి కుమార్ ను కూడా తిరుపతి, సతీష్ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు. హైదరాబాద్ లో సుజాత ఠాకూర్ అనే ఆమె పరిచయం ఉందని,  ఆమె సుచిత్ర ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా కస్తూర్బా స్కూల్ లో సూపర్వైజర్ ఉద్యోగం ఇస్తామని ప్రతి నెల 15 వేల రూపాయల జీతం వస్తుందని రవి కుమార్ ను నమ్మించారు. ఉద్యోగం కోసం రూ.3 లక్షల అవుతుందని, ఒకవేళ ఉద్యోగం రానట్లయితే డబ్బులు రిటర్న్ చేస్తామని నమ్మించారు. ఇలా రెండు దఫాలుగా రూ. 3 లక్షలు వసూలు చేసుకున్న తిరుపతి, సతీష్ లు కస్తూర్బా స్కూల్ లో సూపర్ వైజర్ గా జాబు వచ్చినట్టు సుజాత ఠాకూర్ ఇచ్చిన నకిలీ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 


ఇద్దరు అరెస్టు 


లక్షేట్టిపేట్, హాజీపూర్, జైపూర్ భీమారం, చెన్నూర్ , బెల్లంపల్లి నస్పూర్ లలో ఉన్న కస్తూరిబా స్కూల్ లలో 18 నెలలు వెళ్లిన కూడా జీతం రానందున ఉద్యోగం ఇప్పించిన ఇద్దరు వ్యక్తులను  జీతం గురించి అడిగితే వెళ్లి సుజాత ఠాకూర్ అడుగు అని సేమ్ సమాధానం చెప్పారు తిరుపతి , సతీష్. ఇలా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు తిరుపతి, సతీష్ లను అరెస్టు చేశారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సుజాత ఠాకూర్ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పర్చారు. 
నిందితుల వివరాలు


డబ్బులు ఇస్తే ఉద్యోగం రాదు


మంచిర్యాల ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఈ కేసు వివరాలు తెలుపుతూ చాల మంది యువతి, యువకులు ఉద్యోగాలు చేయాలని కలలుకంటారని, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఇలా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాస్తవంగా ఏ ఉద్యోగమైన సరే తాము చదివిన చదువుల్లో ప్రతిభ, ఇంటర్వూ ఆధారంగా వస్తుందనే విషయం మరిచిపోకూడదన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగం రాదు అనే విషయాన్ని గ్రహించాలన్నారు.