Chandrababu Ongole Rally : ఒంగోలులో రేపటి నుంచి రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు(Mahanadu) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు మంగళగిరి నుంచి ఒంగోలుకు ర్యాలీ(Ongole Rally)గా బయలుదేరారు. మహానాడులో పాల్గొనేందుకు టీడీపీ(TDP) శ్రేణులు భారీగా తరలివెళ్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు వస్తున్నారు. చంద్రబాబు, ఇతర నేతలతో కలిసి భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. మంగళగిరి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా తరలివెళ్లారు. వందల సంఖ్యలో వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌ను ఫాలో అయ్యాయి. మార్గమధ్యలో చిలకలూరిపేట, మార్టూర్, అద్దంకి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీలో చేరాయి. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్దకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగమూరు రోడ్డు, మున్సిపల్ కార్యాలయం మీదుగా హోటల్ సరోవర్‌కు చంద్రబాబు(Chandrababu) చేరుకుంటారు. ఈ సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహానాడులో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలపై టీడీపీ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
- పనిచేయని ఏసీలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఒంగోలులో పర్యటిస్తున్నారు. ఒంగోలు టూర్ లో చంద్రబాబు ప్రయాణించే కార్ లో AC పనిచేయడంలేదు. తీవ్ర ఎండలకు తోడు బుల్లెట్ ప్రూఫ్(Bullet Proof Vehicles) వాహనం లో AC పనిచేయకపోవడంతో చంద్రబాబు ప్రయాణంలో ఇబ్బంది పడ్డారు. కాన్వాయ్ లో అదనంగా ఉండే మరో బుల్లెట్ ప్రూఫ్ కార్ లోనూ ఏసీ పనిచేయకపోవడంతో ప్రత్యామ్నాయం లేక పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కారులో చంద్రబాబు ప్రయాణించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సరిగా లేక పోవడంతో సాధారణ కారులోనే చంద్రబాబు ప్రయాణించారు. కాన్వాయ్ వాహనాల కండిషన్ బాగోలేక పోవడంపై టీడీపీ నేతల అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అనంతరం చంద్రబాబు వ్యక్తిగత వాహనం తెప్పించుకుని ప్రయాణం మొదలుపెట్టారు.
- అమలాపురం అల్లర్లపై
ఇటీవలి అమలాపురం(Amalapuram) అల్లర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన అందమైన కోనసీమ(Konaseema)లో చిచ్చుపెట్టిన ఘనత వైసీపీకే చెందుతుందని విమర్శించారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారన్నారు. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్ కూడా రాలేదన్నారు. వాళ్లకు వాళ్లే ఇళ్లను తగులబెట్టుకుని వేరే వాళ్లపై నిందిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యంతర ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధపడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.