గద్వాల: అతడు చదువుల్లో టాపర్. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ స్కోర్ చేసిన విద్యార్థికి ఇంటర్ ఫస్టియర్‌లో జిల్లాలో రెండో ర్యాంక్ వచ్చింది. కానీ లెక్చరర్ చేసిన తీవ్ర అవమానాన్ని తట్టుకోలేక ఓ టాలెంట్ ఉన్న ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లిలో చోటుచేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) అనే విద్యార్థి గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నాడు.

Continues below advertisement

నువ్వేమైనా మంత్రి కుమారుడివా..

Continues below advertisement

ఈ క్రమంలో కాలేజీలో ఓ మహిళా లెక్చరర్ 435 మార్కులు సాధించగా.. మరొక విద్యార్థితో తరుణ్‌ను పోలుస్తూ, ‘434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారంటూ’ మిగతా విద్యార్థుల ముందే కించపరిచింది. అలా అందరి ముందు నిరుత్సాహపరచడం, అవమానించడం కరెక్ట్ కాదని తరుణ్ ఆమెకు విజ్ఞప్తి చేశాడు. దాంతో విచక్షణ కోల్పోయిన ఆ లెక్చరర్.. "నువ్వేమైనా మంత్రి కొడుకువా? అంతకంటే గొప్పోడివా?" అంటూ తరుణ్ చెంపపై కొట్టి తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇలా ఎవరికీ జరగకూడదు..

లెక్చరర్ ప్రవర్తనకు తోటి విద్యార్థులందరూ నవ్వడంతో తరుణ్ తీవ్ర ఆవేదనకు, మనోవేదనకు గురయ్యాడు. 2 రోజుల పాటు తీవ్రంగా కలత చెందిన తరుణ్ మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీచర్లు, లెక్చరర్లు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి తప్ప ఇలా అవమానించకూడదని, సున్నిత స్వభావం ఉన్న ఉన్న వారికి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆ లెక్చరర్‌కు తెలియాలని తన సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయం ప్రజలందరికీ తెలియాలనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.