హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వైశాలి నగర్ రైల్వే అండర్ పాస్ సమీపంలో తెరిచి ఉన్న డ్రైనేజీ మాన్ హోల్‌లో పడి 70 ఏళ్ల వృద్ధుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ నివాసి బాలయ్య (70)గా పోలీసులు గుర్తించారు. నాలా మరమ్మత్తు పనులు జరుగుతున్న సమయంలో కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, రక్షణ చర్యలు తీసుకోకపోవడమే దానికి కారణమని జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా (HYDRA), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన బాలయ్య ఆచూకీ కోసం సహాయక బృందాలు నాలాలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వైశాలినగర్ అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మతులు చేస్తున్న సమయంలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో బాలయ్య పడినట్లు పోలీసులు తెలిపారు. మరమ్మతులు చేయడానికి కొన్ని రోజులుగా ఈ అండర్ పాస్‌ను అధికారులు మూసివేశారు
నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. వాహనదారులు తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా, వేగాన్ని నియంత్రిస్తూ డ్రైవింగ్ చేయాలి. రహదారులపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనల్ని వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసర ప్రయాణాలు చేసే వారు సాధారణ సమయం కంటే కొంత అదనపు సమయాన్ని కేటాయించుకుని బయలుదేరడం మంచిదని సూచించారు. సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు అందించే అధికారిక సమాచారాన్ని, ట్రాఫిక్ అప్‌డేట్‌లను గమనిస్తూ మీ జర్నీ ప్లాన్ చేయాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
