IND Vs AUS Tickets In Hyderabad: హైదరాబాద్ లో జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ హంగామాతో నగరంలోని జింఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట జరిగింది. వీరిలో ఓ మహిళకు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అంతకుముందు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిపై లాఠీచార్జి చేశారు. దీంతో దాదాపు 20 మంది వరకూ క్రికెట్ అభిమానులు కింద పడిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నేడు తెల్లవారుజాము నుంచే అభిమానులు టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ వద్ద కిలో మీటర్ల కొద్దీ క్యూ కట్టారు. జింఖానా గ్రౌండ్ వద్ద అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. గాయపడ్డ వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
వచ్చే ఆదివారం (సెప్టెంబరు 25) ఉప్పల్ వేధికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో హెచ్‌సీఏ విక్రయిస్తుంది. దీంతో అభిమానులు పెద్ద సంఖ్యలో జింఖానా గ్రౌండ్ కు తరలివచ్చారు. క్యూలో ఉన్న క్రికెట్ అభిమానులు ప్రధాన గేటు నుంచి ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరినొకరు తోసుకోవడంతో దాదాపు 20 మంది స్పృహ తప్పిపోయారు.
మొదటి నుంచి గందరగోళమే
టికెట్ల విక్రయానికి సంబంధించి మొదటి నుంచి తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ జరగాల్సిన డేట్ దగ్గరికి వస్తున్నప్పటికీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లో టికెట్లు అంటూ హెచ్‌సీఏ దేనిపైనా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో హెచ్‌సీఏ తీరుపై అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి జింఖానా గ్రౌండ్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజాహరుద్దీన్ ప్రకటించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. కొవిడ్ పరిస్థితుల వల్ల క్రికెట్ మ్యాచ్ లు వీక్షించేందుకు అభిమానులకు పెద్దగా అవకాశం రాలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా హైదరాబాద్‌లో నిర్వహించలేదు. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. అయితే సక్రమ మార్గంలో టిక్కెట్లు అమ్మడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా విఫలమైంది. అంచనాలకు మించి అభిమానులు తరలిరావడంతో ఇలా తోపులాట జరిగింది.
ఎవరూ చనిపోలేదు - డీసీపీ
జింఖానా గ్రౌండ్ వద్ద జరిగిన తొక్కిసలాట, లాఠీఛార్జి ఘటనలో ఎవరూ చనిపోలేదని నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ తెలిపారు. ఓ మహిళ చనిపోయారనే వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ మహిళకు సకాలంలో సీపీఆర్ చేశారని, ప్రస్తుతం ఆమె యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. టికెట్ల అమ్మకం విషయంలో హెచ్‌సీఏ యాజమాన్యం లోపాలు ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.