తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం  వాయిదా పడింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణా రాష్ట్ర కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 


ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంబించాలని ప్రభుత్వ భావించింది. దీని కోసం భారీ ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఈ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. 


సిఎం కేసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఆ సమయానికి దాదాపు అన్ని పనులు పూర్తి చేసేలా అధికారులు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేది 2019న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోపే ప్రస్తుతం నిర్మాణం పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ. 610 కోట్ల రూపాయల వ్యవయంతో రూపుదిద్దుకుంటోంది.


వాస్తవానికి ఈ ఏడాది జనవరి 18న ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ పనులు పెండింగ్ లో ఉండటంతో సచివాలయ ప్రరంభాన్ని ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయం మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించేలా వైభవంగా ప్రారంభం కానుంది. 


తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభ వేడుకలు అన్ని నియోజకవర్గాల్లోనూ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రతి నియోజక వర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.  తెలంగాణ సాంస్కృతిక వైభవం కళ్లకు కట్టేలా సచివాలయాన్ని నిర్మించి.. అంబేద్కర్ పేరు పెట్టినందున ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. 


సచివాలయ ప్రారంభ అనంతరం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 వేల మంది హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. జన సమీకరణ కోసం ఈ నెల 13 న గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఇంచార్జిలుగా నియమిస్తామని..ఇంచార్జిలు 13 నుంచి 17 వరకు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారని తెలిపారు. సచివాలయ  ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరు కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
  
150-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ ను నిర్మించారు.  20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.617 కోట్లతో గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌ పద్ధతిలో సచివాలయ నిర్మాణపనులు చేపట్టారు. భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్‌ చేశారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో సీఎం కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, మరో పెద్ద హాల్‌ ఉంటాయి. ఇక బిల్డింగ్‌లోని రెండో అంతస్తు నుంచి మంత్రుల ఆఫీసులు ఉంటాయి. ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉంటాయి. విశాలమైన స్థలంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బందికి వేర్వేరుగా పార్కింగ్‌ ఉంటుంది.