Hyderabad Weather:హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా 48 గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. పలు ప్రాంతాల్లో కుంభవృష్టికి అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు ప్రాంతాల్లో జోరు వానలు పడతాయని పేర్కొంది.  

తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షావరణం ఏర్పడింది. హైదరాబాద్‌తోపాటు చాలా జిల్లాల్లో సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణం మరికొన్ని రోజుల పాటు ఉంటుందని మరో 48 గంటల్లో కుంభవృష్టి పడుతుందని హెచ్చరించారు వాతావరణ శాఖాధికారులు. 

పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలియజేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్ష బీభత్సం ఉంటుందని పేర్కొంది. మిగతా జిల్లాలకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల వీస్తాయని పేర్కొంది.  

ఆదిలాబాద్‌, కొమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.  

రాబోయే వారం తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో మేఘావృతమై ఉంటుందని, గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 34  నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని IMD అంచనా వేస్తోంది. హైదరాబాద్‌లో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డితో సహా హైదరాబాద్, దాని పరిసర జిల్లాలు మేఘావృతమైన పరిస్థితులను కొనసాగనున్నాయి. వర్షాలు పడనున్నాయి.