Telangana News: ఎన్‌ కన్వెన్షన్‌తోపాటు కీలకమైన నేతల నివాసాలు, భవనాలు కూల్చేస్తున్న హైడ్రా అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చేందుకు నోటీసులు జారీ చేశారు. మాధాపూర్‌లోని అమర్‌ కో ఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు అంటించారు. ఈ ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వస్తుందని గుర్తించిన అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 


మరోవైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకి కూడా నోటీసులు జారీ చేశారు. నెల రోజుల్లోపు సమాధానం చెప్పాలని లేకుంటే అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటూ ఆదేశాలు జారీ చేశారు. 


హైడ్రా నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. 2017లో తాను కొనుగోలు చేసినప్పుడు తన భూమి FTLలో ఉన్నట్టు తమకు తెలియదన్నారు. తన భూమి FTL పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.