HYDRA commissioner Ranganath | హైదరాబాద్: ఎక్కడ ఏది జరిగినా హైడ్రాతో ముడిపెట్టడం సరికాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో కూల్చివేతలకు హైడ్రాకు ఏ సంబంధం లేదన్నారు. మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని స్పష్టం చేశారు. కొందరు ప్రతి విషయాన్ని హైడ్రా కు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం విచారకరం అన్నారు. ఈ మేరకు ఆదివారం రంగనాథ్ (AV Ranganath) ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి తప్పుడు వార్తల్ని హైడ్రా ఖండిస్తోంది అన్నారు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
‘సంగారెడ్డిలో హోం గార్డుకి గాయమై చనిపోతే, ఆయనను హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం కావడం దురదృష్టకరం. ఇటీవల కూకట్ పల్లి చెరువు పరిసరాల ప్రాంతాల్లో యింటిని కూల్చివేస్తారేమోనని బుచ్చమ్మ అనే మహిళా ఆత్మహత్య చేసుకుంటే హైడ్రాకు ఆపాదించారు. కానీ వారికి హైడ్రా ఎలాంటి నోటీసులు (Hydra Notice) కూడా ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లాలో కూల్చివేతలు జరిగినా కూడా హైడ్రాకు ఆపాదిస్తున్నారు. అయితే హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని అందరూ గ్రహించాలి. కూల్చివేతలు అన్నీ హైడ్రాకు ముడి పెట్టవద్దు. కొందరు హైడ్రాను అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు మీరు సపోర్ట్ చేయవద్దు. సామాజిక మాధ్యమాలలో వచ్చే విషయాలు నిజాలని నమ్మకూడదు. అయితే జీహెచ్ఎంసీ (GHMC Area) పరిధిలో, ఓఆర్ఆర్ పరిధి (ORR Area)లో చెరువులు, నాలాలు, ఇతర జలాశయాల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న హైడ్రాకు సంబంధం లేని ఘటనలపై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మల్కాపూర్ చెరువు ఘటనపై హరీష్ రావు ఆగ్రహం
‘హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామాలో సంగారెడ్డి జిల్లా హోంగార్డు గోపాల్ తీవ్రంగా గాయపడితే కాపాడుకునే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం. డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువు కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, ఆ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య. ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న హోంగార్డు గోపాల్ ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తి బాధ్యత వహించి మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడాలని’ తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
Also Read: KTR: జ్వరం నుంచి కోలుకున్న కేటీఆర్- సోమవారం నుంచి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి అది కూలగొట్టు: హరీష్ రావు