KTR On HYDRA : హైదరాబాద్‌ నగరంలో చెరువులు, కుంటల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చడానికి ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRA) రాజకీయ రంగు పులుముకుంది.  హైడ్రా కూల్చివేతల నుంచి తమను  ఆదుకోవాలంటూ మూసీ నిర్వాసితులు బీఆర్ఎస్ నాయకులను ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన ప్రత్యేక బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు.  మాజీ మంత్రి హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి.... సహా గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. బండ్లగూడ, హైదర్‌షాకోట్ ప్రాంతాల్లో వాళ్లు బాధితులను కలిశారు. కానీ కేటీఆర్ అనారోగ్యం కారణంగా వారితో కలిసి పర్యటించలేకపోయారు. 


జ్వరం తగ్గింది
ప్రస్తుతం కేటీఆర్ జ్వ‌రం నుంచి కోలుకున్నారు. దాదాపు 72 గంట‌ల త‌ర్వాత తనకు జ్వ‌రం త‌గ్గిన‌ట్లు కేటీఆర్ ఎక్స్ వేదికగా  ట్వీట్ చేశారు. రాజేంద్ర‌న‌గ‌ర్, అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో ఉన్న మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో తాను సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. బుల్డోజ‌ర్ బెదిరింపుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు అరిక‌ట్టాలి. దాని కోసం మేం చేయ‌గ‌లిగినంత వ‌ర‌కు చేస్తామ‌ని కేటీఆర్ బాధితులకు హామీ ఇచ్చారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నాను. వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నట్లు గత ట్వీట్ లో తెలిపారు. త్వరలో కోలుకుంటా. తెలంగాణ భవన్‌కి వస్తున్న హైడ్రా బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని కేటీఆర్ శనివారం ఉదయం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 







అక్రమ నిర్మాణాల కూల్చివేతనే లక్ష్యం
ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఆక్రమణకు గురైన చెరువులను రక్షించేందుకు, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను తెరపైకి తెచ్చింది. మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, తుమ్మిడికుంట వంటి చెరువులు, వాటి బఫర్ జోన్‌ ను అధిగమింది నిర్మించిన పలు భవనాలు, అపార్ట్‌మెంట్లను హైడ్రా అధికారులు ఇప్పటికే కూల్చివేశారు. ఈ కూల్చివేతల విషయంలో దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు కొత్తగా కూల్చివేతలు కూడా మూసీ నదీ పరివాహక ప్రాంతంలో చేపట్టడం కలకలం రేపుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఇళ్ల మార్కింగ్‌ పూర్తి చేశారు.


 
పేదల పొట్ట గొట్టడం అన్యాయం
ఇప్పటికే మూసీ వాసులు లంగర్ హౌస్ వద్ద పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. అనంతరం కొంతమంది బీఆర్ఎస్ ను ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలను కలిశారు. కన్నీళ్లతో తమ బాధలను వివరించారు. మూసీ నిర్వాసితులకు అండగా నిలుస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. హైడ్రా  కూల్చివేతలు పక్కదారి పట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు పొదుపు చేసిన డబ్బుతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేసి నిరాశ్రయులను చేయడం దుర్మార్గమని విమర్శించారు. అభివృద్ధి పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకానికి పాల్పడుతోందని ఆరోపించారు.


ఎలాంటి సర్వేలకు అంగీకరించవద్దని, కొత్తవారిని తమ కాలనీల్లోకి రానివ్వవద్దని నిర్వాసితులను కోరారు. మూసీ బఫర్ జోన్ , ఎఫ్ టీఎల్ పరిధిలో హెచ్ ఎండీఏ లేఅవుట్లు ఎలా చేశారని ప్రశ్నించారు. ఆ తర్వాత వారంతా మూసీ పరివాహక ప్రాంతంలోని కాలనీల్లో పర్యటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైడ్రా పనితీరు కూడా లోపభూయిష్టంగా ఉందన్నారు. పేదల కడుపు కొట్టవద్దని ప్లకార్డులు ప్రదర్శించారు.


Also Read:  ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం- దసరా బోనస్‌పై కేటీఆర్